రాజకీయ పార్టీలకు వ్యాపారవేత్తలు ఎన్నికల ఫండ్ ఇవ్వడం తెలిసిందే. అయితే ప్రత్యర్థి పార్టీకి నాయకులు ఎన్నికల నిమిత్తం విరాళం ఇవ్వడం గురించి తెలుసా? నెల్లూరు వెళితే ఆ కథా కమామీషూ తెలుసుకోవచ్చు. తాజాగా నెల్లూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. మరో మూడురోజుల్లో కార్పొరేషన్ పాలకులెవరో తేలనుంది.
ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్‌లో అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు భారీ మొత్తంలో విరాళం ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది. చంద్రబాబు హయాంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన సదరు నాయకుడు కూడా వ్యాపారవేత్తే. అయితే ఆయన వ్యాపారం విద్యకు సంబంధించింది. దీంతో టీడీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేనట్టు సదరు నేత మౌనంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్‌లో అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకోసం అక్షరాలా కోటి రూపాయలు ఇచ్చినట్టు ఆ జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హోదాలను అనుభవించి, ఇప్పుడు ప్రత్యర్థి పార్టీకి ఎన్నికల ఫండ్ ఇవ్వడం ఏంటంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు ఖర్చు పెడితే, రాత్రికి రాత్రే తన విద్యా, ఇతరత్రా వ్యాపార సంస్థలను మూసుకోవాల్సిందేనని సదరు నాయకుడి ఆవేదన. తన బాధను అర్థం చేసుకోరూ అని వేడుకుంటున్నారాయన. అయినా పార్టీల్లో ఏముంది? అంతా అధికార మాయ అని వైసీపీ నేతలు అంటున్నారు.