తన జీవోను తానే అమ‌లు చేయ‌ని జ‌గ‌న్ స‌ర్కార్‌!

త‌న జీవోను తానే అమ‌లు చేయ‌ని ప‌రిస్థితి జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కనిపిస్తోంది. దీంతో న్యాయ‌స్థానాల్లో ప‌దేప‌దే చీవాట్లు తినాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోకు విరుద్ధంగా టీటీడీ న్యాయ‌విభాగంలో కీల‌క…

త‌న జీవోను తానే అమ‌లు చేయ‌ని ప‌రిస్థితి జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కనిపిస్తోంది. దీంతో న్యాయ‌స్థానాల్లో ప‌దేప‌దే చీవాట్లు తినాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోకు విరుద్ధంగా టీటీడీ న్యాయ‌విభాగంలో కీల‌క ప‌ద‌విలో ఓ వ్య‌క్తి కొన‌సాగ‌డంపై హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. ఇది ఒక‌ట్రెండు రోజుల్లో విచార‌ణ‌కు రానుంది. అయితే ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా లా ఆఫీస‌ర్ నియామ‌కం ఉంద‌ని, మ‌రోసారి మొట్టికాయ‌లు త‌ప్ప‌వ‌ని న్యాయ‌వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం న్యాయాధికారిగా జిల్లా జ‌డ్జి స్థాయి అధికారిని నియ‌మించాల‌నేది రూల్‌. అయితే జిల్లా జ‌డ్జిలు త‌క్కువ ఉన్నార‌నే కార‌ణం చూపి, రిటైర్డ్ జ‌డ్జిల‌ను నియ‌మించుకుంటామ‌ని గ‌త ప్ర‌భుత్వాలు నిబంధ‌న‌లు తీసుకొచ్చాయి. అయితే ఇది పూర్తిగా హైకోర్టు నియ‌మించాల్సిన పోస్ట్‌. కార‌ణాలేవైనా టీడీపీ హ‌యాంలో రిటైర్డ్ జిల్లా జ‌డ్జినే టీటీడీ లా ఆఫీస‌ర్‌గా కొన‌సాగారు.

రాష్ట్రంలో అధికార మార్పిడి త‌ర్వాత‌…. టీటీడీ లా ఆఫీస‌ర్ కూడా మారారు. గ‌త నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి రిటైర్డ్ జ‌డ్జిని నియ‌మించారు. ఈ నియామ‌కం త‌ర్వాత రెండు నెల‌ల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల్లో మార్పు చేస్తూ ఓ జీవో తీసుకొచ్చింది. జిల్లా జ‌డ్జిని మాత్ర‌మే నియ‌మించాల‌నేది స‌ద‌రు జీవో సారాంశం. అప్ప‌టికే తానే రిటైర్డ్ జ‌డ్జిని నియ‌మించ‌డంతో …ఏడాది వ‌ర‌కూ ఆయ‌నే కొన‌సాగారు.

ఆ త‌ర్వాతైనా తాను తీసుకొచ్చిన జీవో ప్ర‌కారం రెగ్యుల‌ర్ జ‌డ్జిని టీటీడీ లా ఆఫీస‌ర్‌గా నియ‌మించాల్సి ఉంది. ఆ ప‌ని చేయ‌క‌పోగా, మ‌రో రెండేళ్లు రిటైర్డ్ జ‌డ్జిని కొన‌సాగిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది. టీటీడీ నియామకాల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనేక విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తుల‌నే చైర్మ‌న్‌గా, ఈవీగా, అద‌న‌పు జేఈవోగా నియ‌మించార‌నేది తీవ్ర విమ‌ర్శ‌.

మ‌రీ ముఖ్యంగా టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీలో వివిధ పోస్టుల్లో నియామ‌కాల విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించడానికి బ‌దులు, ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌కు తావిచ్చారు. ఇందులో భాగంగానే టీటీడీ లా ఆఫీస‌ర్‌కు రెండో ద‌ఫా కొన‌సాగింపు అనే చర్చ జ‌రుగుతోంది. ప్ర‌భుత్వం త‌న జీవో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తూ రెండో ద‌ఫా టీటీడీ ఆఫీస‌ర్ కొన‌సాగింపుపై రిటైర్డ్ న్యాయ‌మూర్తి శ్ర‌వ‌ణ్‌కుమార్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీన్ని హైకోర్టు స్వీక‌రించింది.

త‌మ‌కు హైకోర్టు వ్య‌తిరేక‌మ‌నే భావ‌న వీడి… త‌మ వైపు జ‌రుగుతున్న త‌ప్పుల‌పై ప్ర‌భుత్వం దృష్టి సారించాల‌నేందుకు ఇదే ఉదాహ‌ర‌ణ అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. నిబంధ‌న‌లేవీ ప‌ట్టించుకోకుండా, ఎవ‌రిష్టం వ‌చ్చిన‌ట్టు వాళ్లు త‌మ‌కు కావాల్సిన వాళ్ల‌ను నియ‌మించుకోవ‌డం వ‌ల్లే న్యాయ‌స్థానాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల 50 మందితో ఏర్పాటు చేసిన టీటీడీ ప్ర‌త్యేక ఆహ్వానితుల నియామ‌కాన్ని కూడా కోర్టు కొట్టేయ‌డాన్ని నిలువెత్తు నిద‌ర్శ‌నంగా చూపుతుండ‌డం గ‌మ‌నార్హం.