అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ అనేక ప్రశ్నలను తెరపైకి తెచ్చింది. వాటన్నింటికి ఆయన సరదాగా సమాధానం ఇచ్చారు. తానొకటి తలస్తే… నెటిజన్లు మరొకటి ఊహించారు. సోషల్ మీడియా కాలమా? మజాకా? ఇంతకూ ఏం జరిగిందో తెలుసుకుందాం.
'ఈ ఏడాది నవంబర్ 11వ తేదీ నాకు చాలా ప్రత్యేకమైంది. నా వృత్తిజీవితంలోనే ఇది మర్చిపోలేని రోజు అవుతుంది. ఎందుకను కుంటున్నారా? అది రానున్న రోజుల్లో నేనే చెప్తాను. అప్పటి వరకు కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను' అని అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు.
ఆయన పోస్ట్ పెట్టడమే ఆలస్యం… నెటిజన్లు రకరకాల డౌట్లతో ఆయన్ను ప్రశ్నలతో ముంచెత్తారు. 'అన్నా లవ్ సెట్ అయిందా? పెళ్లి కుదిరిందా?' అనే ప్రశ్నలు ఎక్కువగా శిరీష్‌కు ఎదురయ్యాయి. దీంతో అల్లు శిరీష్ ఆశ్చర్యపోతూ.. 'నేను వృత్తిపరంగా స్పెషల్ డే అని మరీ మరీ చెప్పాను సామీ' అని కొంటెగా సమాధానం ఇచ్చాడు. సోషల్ మీడియా హర్ట్ చేసిందా? అని, ఇంతకూ ఎంతకాలమో ఈ అజ్ఞాన వాసం అని మరికొందరు నెటిజన్లు ప్రశ్నించడం గమనార్హం.
'ఏంటన్నా? హాలీవుడ్‌కు వెళ్తున్నావా?' అన్న ప్రశ్నలకు శిరీష్ స్పందిస్తూ.. 'అలాంటి ఆశయాలేమీ నాకు లేవు బ్రో, నా కొత్త సినిమా ఫిక్స్ అయింది, కథ నచ్చింది అన్న ఆనందం! నా కెరీర్‌లో ఇది బెస్ట్ స్క్రిప్ట్ అవుతుందనుకుంటున్నా' అంటూ అసలు విషయాన్ని వెల్లడించాడు. సీక్రెట్‌గా పెట్టాలనుకున్నా… నెటిజన్లు మాత్రం తమ సందేహాలతో వాస్తవాలను వెల్లడించేలా చేశారని చెప్పొచ్చు.