దేవినేని అవినాష్ తెలుగుదేశాన్ని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధపడడం అనే పరిణామం చాలా మందికి అనూహ్యం. ఆశ్చర్యకరం.
చంద్రబాబునాయుడు ఇంటిమీద డ్రోన్ ఎగిరినందుకే.. పోలీసులతో గొడవపడి చెలరేగిపోయిన దేవినేని అవినాష్, చంద్రబాబు పట్ల గానీ తెలుగుదేశం పట్ల గానీ అంతగా భక్తిప్రపత్తులు చాటుకున్న అవినాష్… కేవలం నెలల వ్యవధిలోనే.. ఏకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడానికి నిర్ణయించుకోవడం సహజంగా ఎవరూ నమ్మలేరు. కానీ.. దీని వెనుక ఒక ఆసక్తి కరమైన కారణం ఉన్నదని తెలుస్తోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో.. తెలుగుదేశం పార్టీ దేవినేని అవినాష్ కు గుడివాడ టికెట్ కేటాయించింది. అయితే.. ఆ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి కొడాలి నానికి ఉన్న ఫాలోయింగ్ గురించి స్పష్టత ఉన్న అవినాష్ అక్కడినుంచి బరిలోకి దిగడానికి ససేమిరా అంగీకరించలేదు.
అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కొడాలి నానిని ఓడించాలని ఆశపడిన తెలుగుదేశం పార్టీకి అసలు అక్కడ గట్టి అభ్యర్థే దొరకలేదని కూడా అంతా అప్పట్లోనే అనుకున్నారు. దాంతో పార్టీ చాలా వ్యూహాత్మకంగా అన్ని రకాల సమీకరణల పరంగా సమఉజ్జీ కాగలడనే ఉద్దేశంతో దేవినేని అవినాష్ ను అక్కడినుంచి పోటీ చేయించింది. ఫలితం ఎలా వచ్చినా సరే.. నీకు దన్నుగా నేనుంటానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా అప్పట్లో గుసగుసలు వినిపించాయి.
బరిలోకి దిగిన తర్వాత.. ఖర్చుల పరంగా పార్టీ ఇసుమంత కూడా ఆదుకోలేదని సమాచారం. ఎన్నికల వ్యయం తడిసి మోపెడవుతుండగా.. అవినాష్ ఎప్పటికప్పుడు తన కష్టాలు చెప్పుకోగా.. ముందు ఖర్చు పెట్టేయ్.. ఎన్నికల తర్వాత.. పార్టీ మొత్తం చెల్లిస్తుంది.. ఆలోచించొద్దు అని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారం అవినాష్ శక్తికిమించి ఖర్చు చేసి పోటీపడ్డారు. 19479 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఎన్నికల తర్వాత.. ఒత్తిడి తట్టుకోలేక హామీని గుర్తు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు.. ఆయనను కొంత మేర ఆర్థికంగా ఆదుకోవడానికి సిద్ధపడ్డారని, అయితే లోకేష్ ఒప్పుకోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఓడిపోయిన వారిలో అవినాష్ కు సాయం చేయడం అంటూ జరిగితే.. రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయిన వారు కొల్లలుగా వచ్చి సాయం అడుగుతారని.. భారం అవుతుందని.. లోకేష్ ఒప్పుకోలేదని తెలుస్తోంది.
తనకు ఇష్టంలేకపోయినా గుడివాడ నుంచి బరిలోకి దించడమే కాకుండా, ఇచ్చిన మాట తప్పి, కష్టాల గురించి పట్టించుకోకుండా ఉన్న పార్టీ వైఖరిపై అవినాష్ విసిగిపోయినట్లుగా సమాచారం. వేరే గత్యంతరం లేకనే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.