హేళన చేసిన మూర్ఖులు ఇప్పుడు ఏమంటారో?

జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో ఆయన మీద హత్యాప్రయత్నం జరిగింది. విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఉండగా, శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో జగన్ మీద దాడి చేశాడు. ఈ దాడిలో…

జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో ఆయన మీద హత్యాప్రయత్నం జరిగింది. విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఉండగా, శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో జగన్ మీద దాడి చేశాడు. ఈ దాడిలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, స్వల్పంగా గాయపడ్డారు. ఆ కోడికత్తితో దాడి కేసు నిందితుడు అరెస్టయి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు. ఇప్పటికీ కేసు విచారణ జరుగుతోంది. 

అయితే ఈ దాడి వ్యవహారాన్ని కేసు పెట్టిన తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా వదలిపెట్టేసింది. కానీ విపక్షాలు మాత్రం దాన్ని పదేపదే రాజకీయ ప్రచారానికి వాడుకోవడం ఒక మామూలు విషయం అయిపోయింది. నిజానికి హత్యాయత్నానికి గురై దాడికి గురైన వ్యక్తి జగన్, రాజకీయ లబ్ధి కోసం ఆయన వాడుకోవాలనుకోవడం సహజం. కానీ.. దాడి జరిగినది కోడికత్తితో అయ్యేసరికి విపక్షాల వారు.. అదొక డ్రామాగా అభివర్ణిస్తూ విమర్శలు చేయడం పరిపాటి అయింది. 

‘కోడికత్తితో ఎవరో చంపడానికి వచ్చారంట.. ఆయన తప్పించుకున్నారంట’ అంటూ కోడికత్తి అనేది చాలా చిన్న విషయంలాగా, అదొక బొమ్మ కత్తి అయినట్టుగా చులకనచేసి మాట్లాడుతూ జనసేనాని పవన్ కల్యాణ్.. దాదాపుగా తన ప్రతి సభాప్రసంగంలోనూ వెటకారం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ కోడి కత్తి అనేది ఎంతటి ప్రమాదకరమో తాజాగా సంక్రాంతి వేడుకలు నిరూపించాయి. 

పందెపు కోళ్ల కాళ్లకు కట్టిన కోడికత్తి పొరబాటున తగిలి గోదావరి జిల్లాల్లో వేర్వేరు దుర్ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఓ గ్రామంలో పందేలు జరుగుతున్న బరిలోంచి కోడిపుంజు హఠాత్తుగా బరి దాటి బయటకు దూసుకురావడంతో దాని కాలికి కట్టిన కత్తి తగిలి పద్మరాజు అనే వ్యక్తి మరణించాడు. ఇంకోచోట పందెపు కోడికాలికి కత్తిని కడుతూ.. అది పొరబాటున తగలడంతో సురేష్ అనే వ్యక్తి మరణించాడు. 

రెండు సందర్భాల్లోనూ అనుకోకుండా పొరబాటును కోడికత్తి తగిలితేనే మనుషులు చనిపోయారు. కోడికత్తి అంటే ఎంత ప్రమాదకరమో, ఎంత పదునుగా ఉంటుందో.. ఎంతగా ప్రాణాలు తీయగలుగుతుందో, దాని పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ రెండు ఘటనలు చెబుతున్నాయి. ఎంత బలమైన పందెపు కోడి అయినా సరే.. ఒక్క కోడికత్తి వేటుకు కుప్పకూలిపోతుందని, ఇవి అంత ప్రమాదకరం అని అందరూ ఇప్పుడు అంటున్నారు. 

మరి ఆరోజున ప్రతిపక్ష నేత జగన్ మీద హత్యాయత్నం జరిగినది ఇదే కోడికత్తితోనే కదా. రాజకీయ మైలేజీ కోసం వాడుకోకపోయినప్పటికీ కూడా.. జగన్ ఏదో డ్రామా నడిపించినట్టుగా ‘కోడికత్తితో చంపడానికి వెళ్లారట’ అంటూ వెటకారం చేసిన మూర్ఖులు ఇప్పుడేమంటారు.. అనేచర్చ ప్రజల్లో నడుస్తోంది.ఆరోజున అదృష్టవశాత్తూ జగన్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని అందరూ అనుకున్నారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా ఇద్దరి ప్రాణాలను కోడికత్తి బలితీసుకున్న సంఘటనలు గమనిస్తే అది నిజమే అనిపిస్తోంది.