మోడీ ప్రచారయావపై స్ట్రెయిట్ ఎటాక్!

ఆ నాయకుడు ప్రస్తుతం ఫాంలో లేరు. పాపం పార్టీ కూడా ఫాంలో లేదు. కానీ..చాలా రీజనబుల్ పాయింట్ ను లేవనెత్తారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రచార యావను ఆయన నిలదీశారు. దేశంలోని సామాన్య ప్రజల కోసం…

ఆ నాయకుడు ప్రస్తుతం ఫాంలో లేరు. పాపం పార్టీ కూడా ఫాంలో లేదు. కానీ..చాలా రీజనబుల్ పాయింట్ ను లేవనెత్తారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రచార యావను ఆయన నిలదీశారు. దేశంలోని సామాన్య ప్రజల కోసం ఏమైనా పనిచేసినప్పుడు.. దేశాన్ని ఉద్ధరించినట్లుగా ప్రచారం కోరుకుంటే అర్థముంటుంది గానీ.. కేవలం సంపన్నుల కోసం పనిచేసినప్పుడు దానిని కూడా దేశోద్ధరణ కింద జమకట్టాలని కోరుకోవడంలో ఉండే తమాషాను ఆయన ప్రశ్నించారు. ఈ స్ట్రెయిట్ ఎటాక్ మొత్తం సికింద్రాబాద్- విశాఖ మధ్య మొదలైన వందేభారత్ కొత్త రైలు గురించి కాగా, ఆ ఎటాక్ చేసిన నాయకుడు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య.

వందేభారత్ రైలుగురించి అంతగా మురిసిపోవాల్సినది ఏమున్నదని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నిస్తున్నారు. ఇది సామాన్యులకు పనికొచ్చే రైలు కాదు కదా.. దానికి అంత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఏమున్నది? అనేది ఆయన ప్రశ్న. 

రెండు తెలుగురాష్ట్రాలను అనుసంధానం చేస్తూ వందే భారత్ రైలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేశంలో ఇది ప్రథమం కాకపోయినప్పటికీ.. ఈ రైలు సర్వీసును సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. కేంద్రమంత్రులు, గవర్నరు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

వందేభారత్ రైలు రాబోతున్నదంటూ చాలా కాలం ముందునుంచి భయంకరంగా ఊదరగొట్టారు. దానికి తగ్గట్టుగానే మీడియాలో విపరీతమైన ప్రచారం లభించింది. అయితే ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో టికెట్ ధరలు చాలా ఎక్కువ. సాధారణ చెయిర్ కార్ 1720 కాగా, ఎగ్జిక్యూటివ్ చెయిర్ కార్ లో 3170 గా ధరలు నిర్ణయించారు. 

కొన్ని సందర్భాల్లో పోలిస్తే.. విమానప్రయాణ చార్జీలకంటె ఈ ధరలు ఎక్కువ అనిపిస్తాయి. సుమారు 1128 మంది ఈ రైలులో ప్రయాణించే అవకాశం ఉంటుంది. సికింద్రాబాదు- విశాఖపట్నం మధ్య కేవలం నాలుగే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఏ రకంగా చూసినా ఇది కేవలం సంపన్నులకు మాత్రమే సేవలందించే రైలు అని అర్థమవుతుంది. అలాంటిది దీని గురించి ఏదో దేశాన్ని ఉద్ధరించినట్లుగా ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యంగా ఉన్నదని పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. సామాన్యులకు జనరల్ బోగీలు కూడా ఉండే కొత్తరైలు ఏదైనా ప్రారంబించి ఉంటే.. దాని గురించి ప్రభుత్వం ప్రచారం చేసుకున్నా నిజానికి సబబుగా ఉండేది. 

ప్రతి చిన్న కార్యక్రమం కూడా తన చేతులుమీదుగా జరగాలని, తనకు ప్రచారం రావాలని కోరిక మోడీలో ఉన్నట్టుగా చాలా విమర్శలు వినిపిస్తుంటాయి. ఆ నడుమ విశాఖలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ.. మన కార్యక్రమాలకు మనమే ప్రచారం కల్పించుకోవాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కానీ.. కేవలం సంపన్నులకు, కోటీశ్వరులకు మాత్రమే సేవలందించే గంగావిలాస్ లాంటి క్రూయిజ్, వందేభారత్ వంటి రైళ్లను స్వయంగా తాను ప్రారంభించి, వాటికి విపరీతమైన ప్రచారం కోరుకోవడం సామాన్య ప్రజలకు మింగుడుపడడం లేదు.