మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షాలన్నీ జట్టుకడితే.. ప్రధాని అభ్యర్థి ఎవరు అవుతారు? అనేది ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో విపక్షాలను వేధిస్తున్న మిలియన్ డాలర్ ప్రశ్న. ఇంతకూ ప్రధాని మోడీ పతనాన్ని నిర్దేశిస్తూ బిజెపిని ఓడించే సత్తా ఉన్నదా లేదా ఎవ్వరూ తేల్చుకోలేకపోతున్నారు గానీ.. ప్రధాని పదవి మీద మాత్రం చాలా మందే ఆశలు పెంచుకుంటున్నారు.
ఇలాంటి నేపథ్యంలో.. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్ విశ్లేషణల్లో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కొంత మైలేజీ రావడం.. విపక్షాల తరఫున దీదీ ప్రధాని అయ్యే అవకాశం ఉన్నదని ఆయన చెప్పడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. అమర్త్యసేన్ వ్యాఖ్యలకు భాజపా నాయకులు కూడా కౌంటర్లు ఇస్తుండడంతో.. దీదీకి ప్రధాని అభ్యర్థిగా మైలేజీ పెరుగుతోంది. అదే సమయంలో.. విపక్షాల ఐక్యతకు దీదీ మైలేజీ గొడ్డలిపెట్టు అవుతుందా? వారి మధ్య ముసలం పుట్టిస్తుందా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
విపక్షాల ప్రధాని అభ్యర్థి అనేది ఒక కామెడీ వ్యవహారం అయిపోయింది. బిజెపి కూటమి నిర్ద్వంద్వంగా నరేంద్రమోడీ నాయకత్వంలోనే ఉంది. అదేసమయంలో విపక్షాలు అసలు ఇప్పటిదాకా ఒక్క దారిలోనే నడవడం లేదు. ఎవరికి వారు ప్రధాని పదవిపై ఆశలు పెంచుకుంటున్నారు. తన పాదయాత్ర రాజకీయం కోసం కాదు అని పదేపదే చెప్పుకుంటున్నప్పటికీ.. రాహుల్ సాగిస్తున్న జోడోయాత్ర.. ప్రధాని పదవి కోసమే అని అందరూ భావిస్తున్నారు. ఆయన ఒకవైపు జోడోయాత్ర సాగిస్తుండగా, దానికి మద్దతుగా మాట్లాడుతున్న, స్థానికంగా పాదయాత్రలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులందరూ.. విపక్ష కూటమికి కాంగ్రెస్ నాయకత్వం తప్ప గత్యంతరంలేదని, కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీనే ప్రధాని అవుతారని పదేపదే చెబుతూ వస్తున్నారు.
అదే సమయంలో.. విపక్షాల ఐక్యత కోసం కాంగ్రెస్ నాయకత్వం అవసరమే అని అంటున్నప్పటికీ.. దేశవ్యాప్తంగా యాత్ర చేయడానికి సిద్ధమవుతున్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ప్రధాని పదవిని కోరుకుంటున్నారు. ప్రధాని అభ్యర్థిగా తాను రేసులో లేనని ఆయన పదేపదే అంటుంటారు. ఢిల్లీలో ప్రజారంజక పరిపాలనను అందించడంతో పాటు, అటు పంజాబ్ లో కాంగ్రెస్, బిజెపిలను మట్టి కరిపించి తన పార్టీని ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకువచ్చిన అరవింద్ కేజ్రీవాల్ కు కూడా దేశప్రధాని కావాలనే కోరిక ఉంది.
విపక్షాలు అన్నీ ఏకం కావాల్సిన సందర్భం వచ్చినప్పుడు.. అందరినీ ఒప్పించడంలో కీలకంగా వ్యవహరించగల సీనియర్ నాయకుల్లో శరద్ పవార్ ఒకరు. ఇటీవల విపక్షాలు కలిసి ఓటమి గ్యారంటీ అని తెలిసిన రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ఆఫర్ చేస్తే ఆయన తిరస్కరించారు. అయితే అవకాశం వస్తే ప్రధాని కావాలనే కోరిక ఆయనకు ఉంది. వీరందరినీ మించి.. 17 సీట్లున్న తెలంగాణకు పరిమితమైన తన పార్టీకి భారాస పేరుతో జాతీయ గుర్తింపు తెచ్చుకున్న కేసీఆర్ ఏకంగా ఎర్రకోట మీద గులాబీ జెండా రెపరెపలాడిస్తా అంటున్నారు. ప్రధాని మీద ఆయనకు చాలా చాలా మక్కువ ఉంది.
ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇంకా ఒక జట్టుగా ఏర్పడని విపక్షాల మధ్య ఇంతగా ప్రధాని పదవికోసం పోటీ ఉంది. మధ్యలో అమర్త్యసేన్ వచ్చి.. మమతా దీదీ విపక్ష ప్రధాని అభ్యర్థి అవుతుందని ఒక స్టేట్మెంట్ ఇస్తే.. అది ముసలం పుట్టించకుండా ఉంటుందా? అని పలువురు విశ్లేషిస్తున్నారు.