పండగనాడు కూడా పాత మొగుడేనా.. అనేది పాత సామెత. అయితే ఈ ఏడాది సంక్రాంతి పండగకు మళ్లీ తెలుగునాట అవే సినిమాలు వచ్చాయి. పేరుకు కొత్త సినిమాలే! అయితే అదే కథ! పెద్ద హీరోలు చిరంజీవి, బాలకృష్ణ.. ఇద్దరూ పోటీ పడ్డారు. అయితే ఈ పోటీ కూడా కొత్తదనానికి కాసింత ఆస్కారం కూడా ఇవ్వలేదు.
దాదాపు పాతికేళ్ల నుంచి తనకు అలవాటైన శైలిలోనే బాలకృష్ణ కొత్త సినిమా వచ్చింది. ఇక చిరంజీవి సినిమా దశాబ్దాల నుంచి టాలీవుడ్ కు అలవాటు అయిన అదే రొడ్డ కొట్టుడు మాస్ మసాలా! ఈ సినిమాలకు యథావిధిగా సినిమా అభిమానులు నిరుత్సాహ పడుతూ ఉంటే, ఆ హీరోల వీరాభిమానులు మాత్రం వీటికే విజిల్స్ కొడుతున్నారు, ఊగిపోతున్నారు! మరి ఊగిపోవడం సంగతలా ఉంచితే.. ఇప్పటికే పతాక స్థాయికి చేరిన తెలుగు సినిమా అభిమానుల దురాభిమానం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పరువు తీస్తోంది. తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు తీసుకురావడం మాట అటుంచితే, ఈ వీరాభిమానుల తీరు ఆఖరికి షోలు ఆగిపోయేంత వరకూ వచ్చింది!
వీళ్ల అల్లరి భరించలేక థియేటర్ల నిర్వాహకులు తాము ఇంత దాష్టీకాలను ఎప్పుడూ చూడలేదని, తెలుగు సినిమా అభిమానుల ఈ చేష్టలను తాము భరించమని, అందుకే షో లు నిలిపేస్తున్నట్టుగా సూటిగా సుత్తిలేకుండా థియేటర్ల నిర్వాహకులు స్పష్టం చేసి అందరినీ బయటకు పంపించేశారు. మంచి మనిషికో మాట అన్నట్టుగా చూస్తే… కాస్తైనా సూక్ష్మం ఉన్న వారికి అర్థం కావాలి. అయితే అర్థం చేసుకునేంత ఆలోచన ఈ దురాభిమానులకు ఉందా అనేది కొశ్చన్ మార్కే.
తెలుగునాట హీరోల పై పెరిగిన దురాభిమానం ఈనాటిది కాదు. ఇది క్రమంగా పెరుగుతూ పోతోంది. దీని ఫలితంగానే తెలుగు సినిమా స్టాండర్డ్స్ కూడా దారుణంగా పడిపోయాయి. అవతల మలయాళీ స్టార్ హీరోలు సంవత్సరానికో రెండు మూడు మంచి సినిమాలను అందిస్తున్నారు. తమ చిత్ర పరిశ్రమ వైపు దేశమంతా చూసేలా చేస్తున్నారు. పరిమిత బడ్జెట్ వనరుల్లో అక్కడి స్టార్లు అందిస్తున్న సినిమాలను ఓటీటీల్లో ఎగబడి చూస్తున్నారు తెలుగు జనాలు కూడా. మరి స్టార్ డమ్ అంటే అది, సినిమా మేకింగ్ అంటే అది, వైవిధ్యం అంటే అది, ప్లానింగ్ అంటే అది, హీరోలుగా స్టార్ డమ్ ను కాపాడుకుంటూనే వైవిధ్యభరితమైన సినిమాలను రూపొందిస్తూ పరిశ్రమ పరువు నిలిపే హీరోలు మలయాళీలు. తెలుగు హీరోలు తమ అభిమానుల వికృత చేష్టలకు ప్రోత్సాహకరంగా అన్నట్టుగా సినిమాలు రూపొందిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. తద్వారా వీరు కోట్ల రూపాయలు పోగేసుకుంటూ ఉన్నారు.
అభిమానుల ఆకతాయి చేష్టలు హద్దులు దాటిపోతున్నాయి. అమెరికా కాబట్టి అక్కడ అడ్డుకున్నారు. మరి ఇండియాలో, అందునా.. తెలుగునాట ఏ పండగపూటో సినిమాకు వెళ్లి ప్రశాంతంగా చూసే పరిస్థితి ఉందా? ఆ స్టార్ హీరో సినిమాను అయినా విడుదల రోజున సాధారణ సినీ ప్రేక్షకుడు ప్రశాంతంగా చూడగలడా? అభిమానుల పేరుతో జరిగే వికృత చేష్టలకు థియేటర్లు వేదికగా మారాయి. వీరి అరుపులు, కేకలు, చేష్టలే తప్ప.. అంతకు మించిన సినిమా అక్కడేమీ ఉండదు విడుదలైన తొలి రోజుల్లో. సినిమా బాగున్నా బాగోలేకున్నా ఇదే కథ. ఎక్కడైనా ఇంతే అని ఈ ముఠాలు అమెరికాలో కూడా అదే రీతిన వ్యవహరించి అక్కడ చీవాట్లు తిన్నారు వీరాభిమానులు.
తెలుగునాట కూడా అమెరికా వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. మరి థియేటర్లలో ఈ వీరాభిమానుల వికృత చేష్టలు ఎంత తప్పో ఈ వీడియోల ద్వారా అయినా అర్థం కావాలి. నడుస్తున్నాయి కదా అని చెప్పి అన్నీ రైటు అయిపోవని ఎన్ఆర్ఐ తెలుగు జనాలు కూడా అర్థం చేసుకోవాలి!