వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కోడిపందేలంటే ఎనలేని ఇష్టం. కోడిపందేలపై ప్రభుత్వం నిషేధం విధిస్తే, దాన్ని సవాల్ చేస్తూ మన ఎంపీగారు న్యాయపోరాటం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఉభయగోదావరి జిల్లాల్లో కోడిపందేలను పెద్ద ఎత్తున నిర్వహించడం ఎప్పటి నుంచో సంప్రదాయంగా వస్తోంది. సంక్రాంతి వచ్చిందంటే… పండుగంతా రఘురామదే అన్నట్టుగా వుండేది.
కోడిపందేల బరిలో ఆయన దిగేవారు. తన కాళ్లకు కోడి కత్తె కట్టుకోవడం ఒక్కటే తక్కువ. పందెం కోళ్లను ఒడిలోకి తీసుకుని, వాటికి బరిలో విడిచి తండ్లాటను చూస్తూ సంబరపడే వారు. పందెం కోళ్ల కంటే ఎక్కువగా రఘురామే దూకుడు ప్రదర్శించేవారు. ఇదంతా గతం. వర్తమానం కనీసం సంక్రాంతికి కూడా తన ఊరికి రాలేని దయనీయ స్థితి. సంక్రాంతికి ఊరికెళ్లాలని మనసు లాగుతున్నా, పోతే తంతారనే భయం ఆయన్ని కట్టడి చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కోడిపందేల బరి వద్ద రఘురామకృష్ణంరాజు భారీ కటౌట్ ప్రత్యక్ష మైంది. పందెం కోడిని చేతిలో పెట్టుకున్నట్టున్న రఘురామ భారీ కటౌట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో మనిషే నేరుగా పాల్గొనే వారని, ఇప్పుడు కటౌట్ పెట్టించుకుని, తనే ఉన్న ఫీలింగ్‌ని ఎక్కడో ఉన్న రఘురామ ఆస్వాదిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాస్త నోటిని అదుపులో పెట్టుకుని వుంటే …ఇలా ఉత్తుత్తి తుత్తి పొందే ఖర్మ పట్టేది కాదు కదా సారూ అనే సెటైర్స్ పేలుతున్నాయి. ఇంతకూ ఎన్నికల బరిలో రఘురామ ఎప్పుడు దిగుతారో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ఆయన టీడీపీ లేదా జనసేన తరపున పోటీలో ఉంటారనే చర్చ నడుస్తోంది.