మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దుపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వివేకా హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి ప్రమేయంపై మెరిట్స్ ఆధారంగా బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టును ఆదేశిస్తూ… ఈ మేరకు కేసు విచారణను అక్కడికి సుప్రీంకోర్టు బదిలీ చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఎర్రగంగిరెడ్డికి కింది కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
2019, మార్చి 19న వివేకాను దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఎర్రగంగిరెడ్డి కీలక నిందితుడు. ప్రస్తుతం ఇతను బెయిల్‌పై పులివెందులలో నిర్భయంగా తిరుగుతున్నాడు. ఎర్రగంగిరెడ్డికి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టును సీబీఐ అధికా రులు ఆశ్రయించారు. అయితే కింది కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ హైకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానాన్ని సీబీఐ ఆశ్రయించింది. ఈ కేసులు పలు దఫాలుగా కీలక వాదనలు జరిగిన తర్వాత ఇవాళ కీలక ఆదేశాలు ఇవ్వడం విశేషం.
ఎర్రగంగిరెడ్డికి బెయిల్ ఇవ్వడంపై ఏపీ హైకోర్టు కూడా మెరిట్స్‌ను పరిగణలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో మెరిట్స్‌ను పరిగణలోకి తీసుకుని ఎర్రగంగిరెడ్డిపై బెయిల్‌పై తేల్చాలని తెలంగాణ హైకోర్టుకు కేసు విచారణను సుప్రీంకోర్టు బదిలీ చేయడం సంచలనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసు విచారణలో ఇది కీలక పరిణామమని చెప్పొచ్చు.
తెలంగాణ హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. వివేకా కేసు విచారణ ఇప్పటికే తెలంగాణకు బదిలీ అయిన సంగతి తెలిసిందే.