సినిమాలో పవర్ స్టార్ అయ్యుండచ్చేమో కానీ, రాజకీయాల్లో మాత్రం పవన్ కి ఓనమాలు కూడా తెలియవని తాజా ఎపిసోడ్ తో మరోసారి పూర్తిగా అర్థమవుతోంది.
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఉచ్చులో పూర్తిగా పడిపోయారు పవన్ కల్యాణ్. చంద్రబాబు తెరవెనుక ఉండి పవన్ ని తోలుబొమ్మలా ఆడిస్తున్నారు. పవన్ ని రెచ్చగొట్టి మరీ జగన్ పై విమర్శలు చేయిస్తూ తన పబ్బం గడుపుకుంటున్నారు.
బాబు ఓ స్ట్రాటజీ ప్రకారం పవన్ ని తన దారిలోకి తెచ్చుకున్నారు. టీడీపీ ముఖ్య నేతల్ని పవన్ ఇంటికి పంపించి మరీ ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తే కార్యక్రమం పెట్టారు.
జగన్ ను ఢీ కొట్టాలంటే మీరే కావాలి, మీరే ఏకైక ప్రత్యామ్నాయం అంటూ స్వయంగా టీడీపీ నేతలే పవన్ భజనలో మునిగిపోయారు. ఇదంతా చంద్రన్న డైరక్షన్లో జరుగుతోంది.
విశాఖలో పవన్ ఇసుక ధర్నాకు టీడీపీ మద్దతివ్వడం, ఇప్పుడు చంద్రబాబు దీక్షను పవన్ సపోర్ట్ చేయడం అన్నీ ఈ ప్లాన్ లో భాగమే.
చంద్రబాబు ఏం చేయాలనుకున్నా.. దాన్ని పవన్ ద్వారా చేయిస్తూ తాను సైలెంట్ గా ఉంటున్నారు. కానీ ఈ విషయం పవన్ కి తెలియకుండా ఆయనకి విపరీతమైన ప్రాధాన్యం ఇస్తున్నట్టు నటిస్తున్నారు. అలా తనకు తెలియకుండానే పవన్ పచ్చ ఉచ్చులో పూర్తిగా పడిపోయారు.
అటు బాబు ఆదేశాల మేరకు నడుచుకునే ఓ సెక్షన్ మీడియా కూడా, ఒక్కసారిగా పవన్ కు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించింది. ఏ మీడియా అయితే ఒకప్పుడు పవన్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందో, అదే మీడియా ఇప్పుడు పవన్ లేకుండా వార్తలు ఇవ్వడం లేదు. ఇలా తన మీడియాతో ఓ పద్ధతి ప్రకారం పవన్ కు ప్రాధాన్యం ఇచ్చినట్టు నటిస్తున్నారు చంద్రబాబు.
అలా పవన్ ని పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకుని ఆడిస్తున్నారు చంద్రబాబు. జగన్ పైకి ఉసిగొల్పుతూ వైసీపీ దృష్టిలో, జనం దృష్టిలో పవన్ ని విలన్ గా చేస్తున్నారు.