ఆల్రెడీ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను విధించేశారు. తమకు దక్కని అవకాశం ఎవరికీ దక్కకూడదు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ తన అధికారాన్ని ఉపయోగించుకుని అక్కడ రాష్ట్రపతి పాలన విధించిందని వైరి పక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. అయితే అంతా రాజ్యాంగం ప్రకారమే అంటూ భారతీయ జనతా పార్టీ చెబుతూ ఉంది.
అలా రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ వ్యతిరేక పక్షాలు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాయని తెలుస్తోంది. అందులో భాగంగా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ లు ఒక ఒప్పందానికి వచ్చాయని టాక్.
ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్ల ఎన్సీపీ-శివసేనలు పంచుకుంటాయట. ఉప ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ కు ఐదేళ్ల పాటు ఇస్తారట. ఇక మంత్రి పదవుల విషయంలో శివసేన-ఎన్సీపీలు సగంసగం. కాంగ్రెస్ పార్టీకి పదకొండు పదవులు దక్కాలని తీర్మానించుకున్నారట. ఇలా రాజీ ఫార్ములాను రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఒప్పందాలకు ఐదేళ్ల విలువ ఉంటుందా? ఈ పార్టీలు ఐదేళ్లూ కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తాయా? వాళ్లు పాలిస్తుంటే బీజేపీ చూస్తూ ఊరికే ఉంటుందా? అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కూటమికి గవర్నర్ అవకాశం ఇస్తారా? అనేవి శేష ప్రశ్నలు!