‘మా మాట వినడం లేదు.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో ఓ కమిటీ వేసి వారి నివేదికను బట్టి చేద్దాం’ అన్నట్లుగా.. హైకోర్టు దాదాపుగా చేతులు ఎత్తేసినట్లుగా చేసిన తీర్మానానికి కూడా సానుకూల ఫలితం లభించలేదు.
అసలు కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సుముఖంగా లేదని, విషయాన్ని లేబర్ కమిషనర్‌కు, ఆయన ద్వారా లేబర్ కోర్టుకు నివేదించడం ఒక్కటే పరిష్కారం అని… రాష్ట్రప్రభుత్వం తెగేసి చెప్పేసింది. దీంతో హైకోర్టు ద్వారా ఆర్టీసీ సమ్మె వివాదం పరిష్కారం అవుతుందనే ఆశ కూడా అడుగంటిపోయినట్టే పలువురు భావిస్తున్నారు.
ఆర్టీసీ విషయంలో ప్రెవేటు రూట్లకు పర్మిషన్లు ఇవ్వడానికి, ఇతర నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదంటూ రాష్ట్రప్రభుత్వం విభజన చట్టాన్ని ఉదాహరించి కోర్టులో నివేదించిన నేపథ్యంలో ఆ వాదనతో ధర్మాసనం కూడా ఏకీభవించింది.
ఇన్నాళ్లూ హైకోర్టు విచారణ పర్వం సాగిన తర్వాత.. ఇప్పుడు వివాదం లేబర్ కోర్టుకు వెళ్లడం తప్ప మరో పరిణామం జరిగేలా కనిపించడం లేదు.
ఇప్పటికే చాలా కాలం గడచిపోయింది. ఆర్టీసీ డిమాండ్ల విషయంలో.. ప్రభుత్వం చాలా గట్టి పట్టుదలతో ఉంది. హైకోర్టు సూచించిన తర్వాత.. పరిష్కరించదగినవిగా ఉన్న 21 డిమాండ్ల విషయం చర్చించడానికి ప్రభుత్వం పిలిస్తే.. విలీనం సంగతి తేలిన తర్వాతే… మిగిలిన అంశాలు.. అంటూ కార్మికులు పట్టుపట్టడం కూడా సమస్య జటిలం కావడానికి దారితీస్తోంది.
ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తెచ్చే జీవో 2015లోనే వచ్చింది. దాని సంగతి తేలవలసి ఉంది. ఆ విషయం తమకు అనుకూలంగా తేలితే గనుక.. సమ్మెలో ఉన్న వాళ్లందరి మీద వేటు కత్తి ఝుళిపించే అవకాశం ఉంది.
హైకోర్టు పూర్తిగా చేతులెత్తేస్తే గనుక.. వ్యవహారం లేబర్ కోర్టుకు వెళ్లి అదే పరిణామం జరిగినా ఆశ్చర్యం లేదు.