చాలా స్వల్ప వ్యవధితోనే తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. చంద్రబాబునాయుడు పార్టీకి ఆపరేషన్లు చేసి, బలవర్ధక టానిక్ లు ఇవ్వడానికి ఒకవైపు కసరత్తులు చేస్తూ ఉండగానే పార్టీలో ఉన్నవారంతా ఒక్కరొక్కరుగా జారుకుంటున్నారు. కులంగానీ, ప్రాంతం గానీ.. తెలుగుదేశం ‘స్ట్రాంగు’ అనుకున్నవేమీ మిగిలేలా కనిపించడం లేదు.
తాజాగా కృష్ణా జిల్లాలో, బెజవాడలో పార్టీకి దన్నుగా ఉన్న యువ నాయకుడు, రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూడా తెలుగుదేశం పార్టీ వీడిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
ఇది బెజవాడ రాజకీయాల్లో తెలుగుదేశానికి పెద్ద దెబ్బే అని చెప్పాలి. కృష్ణా నది కరకట్టను ఆక్రమించుకుని నిర్మించిన ఇంటిలో మాజీ సీఎం చంద్రబాబునాయుడు నివాసం ఉంటుండగా.. వరదల సమయంలో… ముందుజాగ్రత్తల కోసం ఉద్దేశించిన ఒక డ్రోన్ ఆ ఇంటి పై భాగంలో ఎగిరిందని నానా రాద్ధాంతం జరిగిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో పోలీసులతో పెద్దగా తగాదా పెట్టుకుని.. చంద్రబాబు మీద ఈగ వాలనివ్వకుండా ఆరాటపడిపోయింది… ఈ దేవినేని అవినాషే.
అయితే తాను అంతగా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ.. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని అవినాష్ భావిస్తున్నట్లుగా సమాచారం. దాంతో ఎట్టకేలకు పార్టీ వీడిపోవడానికే నిర్ణయించుకున్నారు.
ఎమ్మెల్యే పదవిని వదులకుని మరీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసేశారు. వేటు పడుతుందనే భయం ఉన్నప్పటికీ.. గంటా శ్రీనివాసరావు భాజపాతో చెట్టపట్టాలు వేసేసుకున్నారు. ఇప్పుడు తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు, గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన అవినాష్ కూడా దూరం అవుతున్నారు.
గురువారం బెజవాడలో చంద్రబాబునాయుడు.. ఇసుక దీక్ష చేయనున్న తరుణంలో అవినాష్ నిర్ణయం ఖంగు తినిపించేదే. లోకల్ లీడర్ గనుక, ఆ ప్రభావం దీక్ష మీద కూడా ఉంటుంది. మరి, చంద్రబాబునాయుడు ఈ దెబ్బలన్నిటినీ ఎలా కాచుకుంటారో వేచిచూడాలి.