మ‌ల‌యాళీ స‌త్తా చూపించిన ‘అంతిమ‌తీర్పు’

మ‌ల‌యాళీ సినీ ప్రేక్ష‌కుల‌ది భిన్న‌మైన టేస్ట్. ద‌క్షిణాది భాష‌ల్లో వ‌చ్చే సినిమాల‌తో పోల్చి చూసినా.. మ‌ల‌యాళీ సినిమాల‌ది చాలా భిన్న‌మైన తీరు. ద‌శాబ్దాలుగా త‌మ‌దైన పంథాలో అక్క‌డి మూవీ మేక‌ర్లు సినిమాలు చేస్తూ ఉన్నారు.…

మ‌ల‌యాళీ సినీ ప్రేక్ష‌కుల‌ది భిన్న‌మైన టేస్ట్. ద‌క్షిణాది భాష‌ల్లో వ‌చ్చే సినిమాల‌తో పోల్చి చూసినా.. మ‌ల‌యాళీ సినిమాల‌ది చాలా భిన్న‌మైన తీరు. ద‌శాబ్దాలుగా త‌మ‌దైన పంథాలో అక్క‌డి మూవీ మేక‌ర్లు సినిమాలు చేస్తూ ఉన్నారు. అక్క‌డ హిట్టైన సినిమాల‌ను ఇత‌ర భాష‌ల వాళ్లు రీమేక్ చేసుకుంటూనే ఉన్నారు. ఇత‌ర భాష‌ల సినిమాలు, ఆయా ప‌రిశ్ర‌మ‌ల సైజుతో పోలిస్తే..  వేరే భాష‌ల వాళ్ల‌కు ఎక్కువ సినిమాల‌ను రీమేక్ చేసేందుకు అనువైన స‌బ్జెక్టుల‌ను ఇస్తున్న‌ది కూడా మ‌ల‌యాళీలే.

మ‌ల‌యాళంతో పోలిస్తే చాలా పెద్ద ప‌రిశ్ర‌మ‌లు అయిన హిందీ, త‌మిళ‌, తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ల‌తో పోల్చినా.. మ‌ల‌యాళీలే మెరుగైన సినిమాల‌ను రూపొందిస్తూ ఉంటారు. క‌లెక్ష‌న్లో, వంద రోజులు ఆడ‌ట‌మో దానికి ప్రామాణికం కాదు. ఆ సినిమాలు ప‌క్క భాష‌ల్లో రీమేక్ కావ‌డాన్ని ప్రామాణికంగా తీసుకుంటే.. ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీకే మ‌ల‌యాళీ చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌త్యేకం!

ఇప్పుడు మ‌ల‌యాళీ రీమేక్ ల ప‌ట్ల ఇత‌ర భాష‌ల  మూవీ మేక‌ర్లు వెంప‌ర్లాడుతూ ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితి కొత్త‌దేమీ కాదు. ఇలా ఇత‌ర భాష‌ల వాళ్ల‌ను ఆక‌ట్టుకునేలా ఇది వ‌ర‌కూ బోలెడ‌న్ని ఎమోష‌న‌ల్, థ్రిల్ల‌ర్ సినిమాల‌ను ఇచ్చింది మ‌ల‌యాళీ చిత్ర ప‌రిశ్ర‌మ‌. అలాంటి వాటిల్లో ఒక‌టి 'అంతిమ‌ తీర్పు' తెలుగు వాళ్ల‌ను మ‌రీ గొప్ప‌గా ఆక‌ట్టుకోలేక‌పోయిన సినిమా ఇది. ఎంతో డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో వ‌చ్చిన సినిమా ఇది.

దీని ప్ర‌త్యేక‌త‌లు ఎన్నో ఉన్నాయి. మ‌ల‌యాళంలో మ‌మ్ముట్టీకి సూప‌ర్ స్టార్ ఇమేజ్ రావ‌డంలో కీల‌క పాత్ర పోషించిన సినిమాల్లో ఇది ఒక‌టి. అక్క‌డ 'న్యూఢిల్లీ' పేరుతో రూపొందింది. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ కావ‌డంతో.. తెలుగు, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ప్ర‌ముఖ హీరోలు ఈ సినిమాను రీమేక్ చేశారు.

తెలుగులో కృష్ణంరాజు, క‌న్న‌డ‌లో అంబ‌రీష్, హిందీలో జితేంద్ర‌లు రీమేక్ చేశారు ఈ సినిమాను. విశేషం ఏమిటంటే.. ఒరిజిన‌ల్ వెర్ష‌న్ ను రూపొందించిన ద‌ర్శ‌కుడే ఈ సినిమాను తెలుగు, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో కూడా రీమేక్ చేశాడు. ఒకే సినిమాను నాలుగు సార్లు రూపొందించాడు ఆ ద‌ర్శ‌కుడు. అత‌డి పేరు జోషి.

ఈ సినిమాకు సంబంధించిన ఇంకో ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. దీన్ని ఏ భాష‌లో చూసినా దాదాపు అంతటా ఒకే న‌టులే క‌నిపిస్తారు. హీరోయిన్ పాత్రలో సుమ‌ల‌త క‌నిపిస్తుంది. మ‌ల‌యాళంలో మ‌మ్ముట్టీ స‌ర‌స‌న న‌టించిన ఆమె తెలుగు వెర్ష‌న్ కృష్ణంరాజుతో, క‌న్న‌డ‌లో అంబ‌రీష్ తో, హిందీలో జితేంద్ర‌తో క‌లిసి న‌టించింది!

హీరోకి చెల్లెలు పాత్ర‌లో న‌టించిన న‌టి ఊర్వ‌శి.. మ‌ల‌యాళంతో మొద‌లుపెట్టి తెలుగు, క‌న్న‌డ‌, హిందీ వెర్ష‌న్ల‌లో న‌టించింది.

కీల‌క పాత్ర‌లో న‌టించిన సురేష్ గోపి మ‌ల‌యాళంలో త‌ను చేసిన పాత్ర‌నే.. తెలుగు, హిందీ, క‌న్న‌డ భాష‌లో చేశాడు. అలాగే న‌టుడు త్యాగ‌రాజన్ కూడా నాలుగు భాష‌ల్లోనూ అదే పాత్ర‌నే చేశాడు!

వీళ్లే కాదు… ఒక్కో సీన్లో మాత్ర‌మే క‌నిపించే వాళ్లు కూడా నాలుగు భాష‌ల్లో దాదాపు కామ‌న్ గా క‌నిపిస్తారు! అవ‌న్నీ రీ షూట్ చేసిన సీన్లే.  కానీ చిన్న చిన్న పాత్ర‌ల్లో అదే న‌టుల‌నే పెట్టి రీమేక్ చేశాడు ద‌ర్శ‌కుడు జోషి. ఈ నాలుగు వెర్ష‌న్లూ రెండేళ్ల వ్య‌వ‌ధిలో నిర్మితం అయ్యాయి. కానీ సెట్స్ విష‌యంలో కూడా మార్పు ఉండ‌దు. సినిమాలు ఆసాంతం ఢిల్లీలోనే మొద‌లై, పూర్త‌వుతాయి. పూర్తిగా ఢిల్లీలోనే షూటింగ్ జ‌రుపుకున్న సినిమాలు ఇవి. మ‌ల‌యాళీ వెర్ష‌న్ ను ఏ సెట్స్ మీద అయితే తీశారో.. మిగ‌తా భాష‌ల వెర్ష‌న్ల‌ను కూడా దాదాపు అదే సెట్స్ మీదే తీశారు. ఒకేసారి నిర్మితం కాక‌పోయినా.. వేర్వేరు స‌మ‌యాల్లో రూపొందిన ఈ సినిమాలు సెట్స్ ను కూడా మిస్ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

వెర్ష‌న్ల‌లో ఎంతో ద‌గ్గ‌రి త‌నం ఉన్నా ఈ సినిమా విజ‌యం విష‌యంలో మాత్రం అంత‌టా ఒకే స్థాయిని అందుకోలేక‌పోయింది. న‌చ్చే వాళ్ల‌కు అమితంగా న‌చ్చి, న‌చ్చ‌ని వాళ్ల‌కు పెద్ద‌గా న‌చ్చ‌ని రీతిలో.. స్లోగా అనిపిస్తుంది ఈ సినిమా.

ఈ సినిమా గురించి బాగా ప్ర‌చారం చేసిన పెట్టిన వ్య‌క్తుల్లో మొద్దు శీను ఒక‌రు. ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో నిందితుడిగా ఉండిన జూల‌కంటి శ్రీనివాస రెడ్డి అలియ‌స్ మొద్దు శీను.. తను పోలీసుల‌కు దొర‌క్క ముందు ఒక చాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న‌కు 'అంతిమ తీర్పు' సినిమా అంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్పాడు. అందులో హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ను మొద్ద‌శీను అమితంగా ఇష్ట‌ప‌డ్డాడ‌ట‌.  అప్ప‌టికే ఈ సినిమా వ‌చ్చి చాలా సంవ‌త్స‌రాలు అయిపోయాయి.

ఆర్గ‌నైజింగ్ గా క్రైమ్ చేయ‌డానికి ఒక గైడ్ త‌ర‌హా సినిమా ఇది! చాలా విష‌యాల‌ను బోల్డ్ గా చూపిన సినిమా ఇది! జ‌డ్జిలు కూడా రాజ‌కీయ నేత‌ల‌కు అమ్ముడు పోతార‌నే అంశాన్ని సూటిగా చూపిన సినిమా ఇది! జ‌డ్జిలు అమ్ముడుపోవ‌డం గురించి క‌మ‌ల్ హాస‌న్ సినిమా 'పోతురాజు'లో ప‌రోక్షంగా ఒక సీన్ చూపించారు. అంతిమ తీర్పులో మాత్రం డైరెక్టుగా జ‌డ్జి అమ్ముడుపోయే సీన్ ను పెట్టారు.

హీరో ఒక పత్రికాధిప‌తి.. జీవితంలో త‌నను తీవ్రంగా హింస‌పెట్టిన కొంత‌మంది ప్ర‌ముఖుల‌పై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి ఒక ముఠాను న‌డుపుతూ ఉంటాడు. వారి చేత హ‌త్య‌లు చేయిస్తూ.. అందుకు సంబంధించిన వార్తా క‌థ‌నాల‌ను త‌న ప‌త్రిక‌లో రాస్తూ ఉంటాడు. వాళ్ల విధిరాత‌ను  త‌నే రాస్తున్న‌ట్టుగా విశ్వ‌నాథ్ పేరుతో త‌న క‌లం పేరును పెట్టి.. వార్త‌లు ఇస్తూ ఉంటాడు. ఎవ‌రికీ అంద‌ని సమాచారంలా ఆ ప‌త్రిక‌లో వార్త‌లు వ‌స్తూ ఉంటాయి. ఎందుకంటే.. ఆ హ‌త్య‌ల‌ను చేయించేది ఆ ప‌త్రిక య‌జ‌మానే! ఎవ‌రు ఎలా హ‌త్య‌కు గుర‌య్యారో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా వివ‌రిస్తూ.. ఉద‌యాన్నే ఆ ప‌త్రిక పాఠ‌కుల‌కు చేరుతూ ఉంటుంది. సంచ‌ల‌న క‌థ‌నాలతో పెద్ద పేప‌ర్ గా ఎదుగుతుంది.

వాస్త‌వానికి ఈ క‌థ‌కు మూలం ఒక ఆంగ్ల న‌వ‌ల అని తెలుస్తోంది. ఆ న‌వ‌ల‌ను సినిమాగా మ‌లిచారు. హీరో ఒక సాధార‌ణ జ‌ర్న‌లిస్టుగా ఉన్న‌ప్పుడు ఒక కేంద్ర మంత్రి అత‌డిపై ప‌గ‌బ‌డ‌తాడు. అత‌డి ఉద్యోగాన్ని తీసేయిస్తాడు. అత‌డి ప్రియురాలును అత్యాచారం చేస్తాడు. హీరోపై పిచ్చోడి ముద్ర వేసి, జైలుకు పంపుతాడు కేంద్ర మంత్రి. చిత్ర‌హింస‌లు పెట్టించి హీరోకి ఒక కాలూ, చేయి ప‌డిపోయేలా చేయిస్తాడు. విల‌న్ల చేత హీరోలు  ఈ త‌ర‌హా హింస‌లు ఎదుర్కొనే సినిమాలు 80ల‌లో ఎన్నో వ‌చ్చాయి. అయితే అంతిమ తీర్పులో మాత్రం ఆ స‌న్నివేశాల‌న్నీ చాలా కొత్త‌గా, ఎంతో గాఢ‌త‌తో తీశారు. హాలీవుడ్ లో 70ల‌లో వ‌చ్చిన ఎమోష‌న‌ల్ సినిమాల త‌ర‌హాలో అంతిమ తీర్పు సాగుతుంది.

సెంటిమెంట్ కు అతీతంగా..ఎమోష‌న్స్ ప్ర‌ధానంగా సాగుతుంది క‌థంతా. ఏడ్చి పెడ‌బొబ్బ‌లు పెట్టే సీన్లు ఏవీ ఉండ‌వు, రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు సినిమా అయినా.. ఎక్క‌డ అరిచి డైలాగులు చెప్పేది కూడా ఉండ‌దు! కానీ స‌న్నివేశాల ఇంపాక్ట్ మాత్రం అదిరిపోయే లెవ‌ల్లో ఉంటుంది. మ‌ల‌యాళీల‌కు బాగా న‌చ్చింది, తెలుగు వాళ్ల‌కు అంత‌గా న‌చ్చ‌ని విష‌యం ఇదే కాబోలు. యాంటీ సెంటిమెంట్ సినిమా. జీవితాన్ని అన్ని విధాలుగా కోల్పోతాడు హీరో. అత‌డి జీవితంలో సాధించేది ఏదైనా ఉంటే.. త‌న‌ను జైలుకు పంపిన వారిని చంపి తిరిగి జైలుకు వెళ్ల‌డం. త‌న చెల్లెలు ప్రేమించిన వాడిని కూడా హ‌త్య చేయిస్తాడు. ఆ సీన్ కు సంబంధించి కూడా విప‌రీత స్థాయి సెంటిమెంట్, సాగ‌దీత ఉండ‌దు. ఇలాంటి యాంటీ సెంటిమెంట్ అంశాల‌న్నీ తెలుగు వారికి ఈ సినిమాను పూర్తిగా దూరం చేసిన‌ట్టుగా ఉన్నాయి.

ఇక హీరోని పోలీసులు హింస పెట్టే స‌న్నివేశాలు, హీరోయిన్ పై కేంద్ర మంత్రి అత్యాచారం.. రంగ‌నాథ్ పండించిన కోల్డ్ బ్ల‌డెడ్ విల‌నిజం.. ఇవ‌న్నీ ఈ సినిమా ప్రేక్ష‌కుడిని వెంటాడేలా చేస్తాయి. వీటికి ప్ర‌తీకారంగా ద్వితీయార్థంలో హీరో విజృంభ‌ణ ప్రేక్ష‌కుడి సంతృప్తి ప‌రిచేలా సాగుతుంది.

యూట్యూబ్ లో మాత్రం తెలుగు వెర్ష‌న్ కు మంచి వ్యూసే ఉన్నాయి. ఫీల్ గుడ్ సినిమాలు వీక్షించాల‌నే వారి సినిమా కాదిది. మ‌ల‌యాళీ స్టైల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ను తెలుగులో చూడాల‌నుకుంటే మాత్రం అంతిమ తీర్పు థ్రిల్లింగ్ ట్రీట్!

-జీవ‌న్ రెడ్డి.బి