రోజాపై పోటీకి సై…నీళ్లు చ‌ల్లిన బాబు!

మంత్రి ఆర్కే రోజాను ఓడించాల‌ని జ‌న‌సేన గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో వుంది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో రోజా ముందు వ‌రుస‌లో ఉంటారు. పంచ్ డైలాగ్‌లతో ప‌వ‌న్‌ను రోజా చిత‌క్కొడుతుంటారు. ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో ప‌వ‌న్‌తో పాటు…

మంత్రి ఆర్కే రోజాను ఓడించాల‌ని జ‌న‌సేన గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో వుంది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో రోజా ముందు వ‌రుస‌లో ఉంటారు. పంచ్ డైలాగ్‌లతో ప‌వ‌న్‌ను రోజా చిత‌క్కొడుతుంటారు. ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో ప‌వ‌న్‌తో పాటు జ‌న‌సేన శ్రేణుల్ని రోజా ర్యాగింగ్ చేస్తున్నారు. రోజా వైఖ‌రిని జ‌న‌సేన జీర్ణించుకోలేక‌పోతోంది. ఈ నేప‌థ్యంలో ఈ ద‌ఫా ఎలాగైనా రోజాను తామే ఓడించాల‌ని జ‌న‌సేన ప‌ట్టుద‌ల‌తో వుంది.

మ‌రోవైపు టీడీపీతో పొత్తు కుదుర్చుకోనున్న నేప‌థ్యంలో ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా జ‌న‌సేన నేత‌లు ఓ ప్ర‌తిపాద‌న  సిద్ధం చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ సీట్ల‌ను అడుగుతున్నారు. చిత్తూరు, తిరుప‌తితో పాటు న‌గ‌రి స్థానాల‌ను జ‌న‌సేన నేత‌లు అడుగుతున్నారని స‌మాచారం. న‌గ‌రిలో రోజాను ఓడించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎలాగైనా తామే ద‌క్కించుకోవాల‌ని ఉన్నారు.

ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ప్ర‌తిపాదించిన‌ట్టు తెలిసింది. అయితే న‌గ‌రిలో త‌మ‌కు బ‌ల‌మైన అభ్య‌ర్థి ఉన్నార‌ని, తామే అక్క‌డ రోజాను ఓడించితీరుతామ‌ని బాబు చెప్పిన‌ట్టు స‌మాచారం. మాజీ మంత్రి దివంగ‌త గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు కుమారుడు గాలి భానుప్ర‌కాశ్ న‌గ‌రిలో బ‌ల‌ప‌డ్డారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న రోజా చేతిలో 2,700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ద‌ఫా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌తో పాటు రోజాకు సొంత పార్టీలోనే కావాల్సినంత మంది శ‌త్రువులు త‌యార‌య్యారు. దీంతో రోజాకు రానున్న ఎన్నిక‌ల్లో టికెట్ కూడా డౌటే అనే ప్ర‌చారం లేక‌పోలేదు.

మ‌రోవైపు గ‌త ఎన్నిక‌ల్లో పొత్తులో భాగంగా బీఎస్పీకి న‌గ‌రి టికెట్‌ను జ‌న‌సేన కేటాయించింది. బీఎస్పీ అభ్య‌ర్థి నాగబోయిన ప్ర‌వ‌ల్లిక యాద‌వ్ 3,044 ఓట్లు సాధించారు. జ‌న‌సేన‌-బీఎస్పీ కూట‌మి పెద్ద‌గా ప్ర‌భావితం చూప‌లేద‌ని చెప్పొచ్చు. ఈ లెక్క‌ల‌న్నిం టిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని జ‌న‌సేన ప్ర‌తిపాద‌న‌ను టీడీపీ సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. రోజా ఓట‌మే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో మాత్రం జ‌న‌సేన ఉంది.