తెలుగుదేశం పార్టీకి కొద్దిగా జవసత్వాలు నింపడానికి అధినేత చంద్రబాబునాయుడు.. 12 గంటలు దీక్షలు చేస్తూ.. కష్టపడుతుండవచ్చు గాక… కానీ.. ఆ పార్టీకి జరగవలసిన నష్టం మొత్తం జరుగుతూనే ఉంది. గంటా శ్రీనివాసరావు.. ఇంకా ముహూర్తం ప్రకటించలేదుగానీ.. భాజపాలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన దూకుడుకు ముకుతాడు వేసేలా.. చంద్రబాబునాయుడు సకాలంలో స్పందించకపోతే గనుక.. ముందు ముందు మరింత నష్టం తప్పదని భావించాల్సి వస్తోంది.
తెలుగుదేశం పార్టీకి శాసనసభలో ఉన్నదెల్లా 23 మంది ఎమ్మెల్యేలు. వారిలో వల్లభనేని వంశీ ఆల్రెడీ రాజీనామా చేసేశారు. ఆ నడుమ ఓ ఎమ్మెల్యే ఢిల్లీ వెళ్లి భాజపాలో చేరినంత పనిచేసి.. అబ్బెబ్బే ఉత్తికే వచ్చా అని సెలవిచ్చారు. తాజాగా గంటా ఫిరాయింపునకు మాటా మంతీ పూర్తి చే సుకున్నారు.
వల్లభనేని వంశీ రాజీనామా లేఖ పంపిస్తే.. చంద్రబాబునాయుడు బుజ్జగించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ.. వంశీ లొంగలేదు. ఇప్పుడు గంటా రాంమాధవ్ తో ఢిల్లీలో భేటీ అయ్యాక, బుధవారం నాడు విశాఖలో సోము వీర్రాజుతో కూడా భేటీ అయ్యాక… ఇంకా ఆయన కాషాయం పులుముకున్నట్టుగా ప్రత్యేకంగా నొక్కి వక్కాణించక్కర్లేదు. కానీ తెదేపా నుంచి బుజ్జగించే చర్యలు మొదలైన దాఖలాలు లేవు.
బుజ్జగించే ఉద్దేశం లేకపోతే.. తెలుగుదేశం పార్టీ వీలైనంత తొందరగా నిద్ర మేలుకుని గంటా మీద స్పీకరు ఫిర్యాదు చేస్తే వారికే మంచిది. ఎందుకంటే.. ఎటూ స్పీకరు తమ్మినేని.. ఫిరాయింపు అంటూ ఫిర్యాదు వస్తే.. ఎంతటివారైనా కత్తి దూసి వేటు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక.. ముందే ఫిర్యాదు చేస్తే తెదేపాకు లాభం. గంటా విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ పోతే.. ఆయన ఉన్న ఎమ్మెల్యేలందరినీ సమీకరించి.. సగానికంటె ఎక్కువ మందిని పోగేసి.. చీలికవర్గంగా గుర్తింపు పొందినా ఆశ్చర్యం లేదు.
సోము వీర్రాజు మాటలు కూడా వీలైనంత ఎక్కువ మంది ఆ పార్టీలోకి ఫిరాయించవచ్చుననే అర్థాన్నే ధ్వనిస్తున్నాయి. మరి చంద్రబాబు ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపడతారో వేచిచూడాలి.