తెలుగు భాష మీద మమకారం పవన్ కళ్యాణ్‌కి చాలా ఎక్కువైపోయినట్టు కన్పిస్తోంది. లేకపోతే, తాము అధికారంలోకి వస్తే కేజీ నుంచి పీజీ వరకూ తెలుగులో విద్యా బోధన వుండేలా చేస్తామనీ, అలా తెలుగు మాధ్యమంలో చదువుకునేవారి ఫీజులు ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడమేంటి.? పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్, 'మేం అదికారంలోకి వస్తే..' అంటూ ఏకంగా పత్రికా ప్రకటన విడుదల చేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
ఇసుక పోరాటం తర్వాత పవన్ కళ్యాణ్ తెలుగు మీడియం పేరుతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోన్న విషయం విదితమే. తెలుగు మీడియంని సమర్థించేవారు సైతం, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏకీభవించని పరిస్థితిని స్వయంగా ఆయనే తీసుకొస్తున్నారు. తెలుగు నాట మాత్రమే కాదు.. అంతటా పరిస్థితులు మారిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఇంగ్లీషు మీడియం చదువులకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయిందన్నది నిర్వివాదాంశం.
ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంపై సంచలన నిర్ణయం తీసుకుంది. తొలుత 1 నుంచి 6 తరగతుల వరకు తెలుగు మీడియంని రద్దు చేయాలని నిర్ణయించింది. 2020 నుంచి అమలు కానున్న ఈ నిర్ణయానికి సంబంధించి క్యాబినెట్ ఆమోదం కూడా ఈ రోజు లభించింది. అయితే, ఇంగ్లీషు మీడియంతోపాటు, తెలుగు మీడియం కూడా వుండాలనే డిమాండ్ భాషాభిమానుల నుంచి వస్తోందనుకోండి.. అది వేరే విషయం.
కానీ, కేజీ నుంచి పీజీ వరకూ తెలుగు మీడియం.. అంటే, అది ఈ రోజుల్లో సాధ్యమయ్యే పనే కాదు. తెలుగు భాష పట్ల మమకారం అనేది సమస్య కాదిక్కడ. తల్లిదండ్రులు తమ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించడానికి ఇష్టపడనప్పుడు, ఆ ఇంగ్లీషు మీడియం కోసమే ప్రభుత్వ స్కూళ్ళను లెక్క చేయకుండా, ప్రైవేటు స్కూళ్ళకు పరుగులు పెడుతున్నప్పుడు.. ఇంగ్లీషు మీడియంని ప్రభుత్వ స్కూళ్ళలో అప్లయ్ చేయడం మంచిది.
ఇక, అమ్మ ఒడి పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం జనవరి 26 నుంచి ప్రతి తల్లికీ 16 వేల రూపాయల ఆర్థిక సాయం అందించనుండగా, పవన్ కళ్యాణ్ తెలుగు మీడియం చదువులకి ప్రభుత్వమే ఫీజులు భరిస్తుందని ప్రకటించడం హాస్యాస్పదం కాక మరేమిటి.? పవన్ అపరిపక్వతకు ఇదో నిదర్శనం.