కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది. రాహుల్‌తో పాటు అడుగులో అడుగు వేస్తున్న కాంగ్రెస్ ఎంపీ చౌదరి సంతోష్ సింగ్ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఈయన పంజాబ్‌లోని జలంధర్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
పంజాబ్‌లోని ఫిలౌర్‌లో రాహుల్ భారత్ జోడో యాత్ర సాగుతోంది. రాహుల్‌తో పాటు నడిచేందుకు వచ్చిన ఎంపీ సంతోష్ సింగ్‌కు గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. ఎంపీని వెంటనే లూథియానాలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఎంపీ ప్రాణాలు పోయినట్టు వైద్యులు వెల్లడించారు.
ఎంపీ ఆకస్మిక మృతితో రాహుల్‌గాంధీ షాక్‌కు గురయ్యారు. తనతో అడుగులు వేయడానికి ముందుకొచ్చిన ఎంపీ గుండె పోటుకు గురై ప్రాణాలు కోల్పోవడంతో రాహుల్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రాహుల్ పాదయాత్రను నిలిపేసి ఆస్పత్రికి వెళ్లి ఎంపీ మృత దేహానికి నివాళులర్పించారు. ఇవాళ పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఎంపీ అంత్యక్రియల్లో రాహుల్ పాల్గొనే అవకాశం వుంది. పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అక్కడ ఆప్ పరిపాలన పగ్గాలు చేపట్టింది. కాంగ్రెస్‌కు పంజాబ్ బలమైన రాష్ట్రంగా ఉండేది. ఇప్పుడక్కడ రాజకీయ పరిణామాలు మారాయి. పంజాబ్‌లో తిరిగి పాగా వేసే క్రమంలో రాహుల్ అక్కడ పాదయాత్ర చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విషాదం చోటు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ షాక్‌కు గురైంది.