సినిమా వాళ్ల మీద రకరకాల గాసిప్ లు వినపడుతుంటాయి. థంబ్ నెయిల్స్ లో రకరకాల అబద్ధాలు సృష్టించి వదిలేస్తుంటారు. ఆమధ్య శ్రీముఖి పెళ్లిపై చాలా పుకార్లు వచ్చాయి. ఈ కోవలో ఇప్పుడు జయసుధ పేరు కూడా ట్రెండింగ్ లోకి వచ్చింది. జయసుధ మూడో పెళ్లి చేసుకోబోతోందనేది ఆ వార్త సారాంశం. ఓ ఎన్నారైని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న జయసుధ, ఇటీవల ఆయనతో పలు సందర్భాల్లో బయట కనిపించిందంటూ పుకార్లు వ్యాపించాయి.
ఫిలిప్ రూయెల్స్ అనే వ్యక్తితో ఇటీవల జయసుధ తరచూ బయట కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె వెళ్లే ఏ కార్యక్రమానికైనా ఆయన కూడా వస్తుండటంతో జయసుధపై వినిపిస్తున్న పుకారు నిజమేననే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే అంతలోనే జయసుధ తనపై వచ్చిన రూమర్లకు చెక్ పెట్టారు. రూయెల్స్ ఎవరో చెప్పేశారు.
ఇంతకీ ఎవరా రూయెల్స్..?
తన బయోపిక్ తీసేందుకు ఫిలిప్ రూయెల్స్ అనే వ్యక్తి అమెరికా నుంచి వచ్చాడని చెబుతున్నారు జయసుధ. ఆమె గురించి ఆయన ఇంటర్నెట్ లో రీసెర్చ్ చేసి పలు వివరాలు తెలుసుకున్నారట. ఆ తర్వాత బయోపిక్ తీయాలనుకున్నారట. ఇటీవల అమెరికా వెళ్లినప్పుడు కూడా జయసుధ అక్కడ రూయెల్స్ ని కలసి వచ్చారట. అయితే ఇక్కడ జయసుధకు ఉన్న ఫాలోయింగ్ ఏంటి, ఆమెకు ఉన్న స్నేహితులెవరు, ఇలాంటి వివరాల కోసం రూయెల్స్ ఇండియాకు వచ్చారని చెబుతున్నారు జయసుధ. అంతే కాని ఆయనతో ఇంకేమీ సంబంధం లేదని వివరణ ఇచ్చారు.
ఆయన వచ్చి బయోపిక్ తీయాలా..?
జయసుధ బయోపిక్ తీయాలనుకుంటే ఇక్కడే చాలామంది ఉన్నారు. మరి అమెరికా నుంచి వచ్చిన ఫిలిప్ రూయెల్స్ కి అంత ఆసక్తి ఏంటనేది తెలియాల్సి ఉంది. జయసుధకు ఆయన వీరాభిమాని అయిఉంటారేమోనని అంటున్నారు.
జయసుధకు గతంలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటిసారి కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ ను వివాహమాడారు జయసుధ. కొంతకాలం తర్వాత వారిద్దరూ వేరుపడ్డారు. బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ ను రెండోపెళ్లి చేసుకున్నారు. వారికి ఓ కొడుకు ఉన్నారు. అనారోగ్య సమస్యలతో నితిన్ కపూర్ 2017లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. అప్పటినుంచి జయసుధ కొడుకుతో కలసి ఉంటున్నారు. ఇప్పుడిలా పుకార్లతో మరోసారి ఆమె వైవాహిక జీవితం వార్తల్లోకెక్కింది.