కీచక టీచర్.. ఏకంగా 30 మంది బాలికలపై..!

తోటి విద్యార్థులెవరైనా తప్పు చేసినా, చెడుగా మాట్లాడినా.. నీపై టీచర్ కి కంప్లయింట్ చేస్తానని హెచ్చరిస్తారు స్టూడెంట్స్. కానీ టీచరే తప్పు చేస్తే, చెప్పుకోలేని విధంగా మనసు గాయపరిస్తే.. ఆ విద్యార్థినులు ఎవరికి చెప్పుకుంటారు.…

తోటి విద్యార్థులెవరైనా తప్పు చేసినా, చెడుగా మాట్లాడినా.. నీపై టీచర్ కి కంప్లయింట్ చేస్తానని హెచ్చరిస్తారు స్టూడెంట్స్. కానీ టీచరే తప్పు చేస్తే, చెప్పుకోలేని విధంగా మనసు గాయపరిస్తే.. ఆ విద్యార్థినులు ఎవరికి చెప్పుకుంటారు. కొన్నాళ్లు మౌనంగా ఆ వేధింపుల్ని భరించారు. చివరకు తట్టుకోలేక ఓ విద్యార్థిని, తల్లిదండ్రులకు చెప్పుకుంది, వారి సాయంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ కీచక టీచర్ కటకటాలపాలయ్యాడు.

కేరళలోని కన్నూర్ జిల్లాలోని హైస్కూల్ లో ఫైజాన్ అనే 52 ఏళ్ల ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. ఆరు, ఏడో తరగతి విద్యార్థులను అతను లైంగికంగా వేధించేవాడు. ఆ స్కూల్ లో దాదాపుగా 30 మంది విద్యార్థులు ఫైజాన్ బాధితులు. అయితే ఒకరికొకరు తమ బాధను చెప్పుకున్నారు కానీ, బయటపెట్టే సాహసం చేయలేదు. చివరకు ఓ విద్యార్థిని ఫైజాన్ వికృత చేష్టను తల్లిదండ్రులకు చెప్పుకోవడంతో వారు స్కూల్ కి వచ్చి గొడవ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేపట్టారు.

ఆరో తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థులు టీచర్ ఫైజాన్ తమతో తప్పుగా ప్రవర్తించినట్టు చెప్పారు. వారి వాంగ్మూలంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మలప్పురం జిల్లా కొండొట్టి ఫైజాన్ స్వగ్రామం. తప్పించుకుని పారిపోవాలని చూడగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు.

ఏడో తరగతిలోని 20మంది విద్యార్థులు కూడా ఫైజాన్ తమతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు చెప్పారు. దీంతో 52 ఏళ్ల ఫైజాన్ పై ఐపీసీ సెక్షన్ 354, సెక్షన్ 7,8,9,10 సెక్షన్ల కింద 5 కేసులు నమోదు చేశారు పోలీసులు, రిమాండ్ కి తరలించారు.