చిత్రం: వారసుడు
రేటింగ్: 2.25/5
తారాగణం: విజయ్, రష్మిక, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శ్యాం, యోగిబాబు
కెమెరా: కార్తిక్ పళని
ఎడిటింగ్: కె.ఎల్ ప్రవీణ్
సంగీతం: ఎస్.ఎస్.తమన్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పివిపి
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
విడుదల తేదీ: 14 జనవరి 2023
ఇది ఒక డబ్బింగ్ చిత్రం. తెలుగు నిర్మాతలు, తెలుగు దర్శకుడు తీయడం దీంట్లో ఉన్న తెలుగుతనం. సినిమాలో కట్టిపారేసే విషయముంటే ఈ భాషాభేదాలు, ప్రాతీయభావనలు ప్రేక్షకులకి కలగనే కలగవు. సినిమా తమకు మరీ నచ్చితే పాన్ ఇండియా చేసేస్తున్నారు కూడా.
ట్రైలర్ చూస్తే కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం అనిపించినా గతంలో చూసేసిన ఎన్నో సినిమాలు కళ్లముందు మెదిలాయి చాలామందికి. అయినప్పటికీ ప్రతి ఫ్రేం లోను రిచ్నెస్ కనిపించడం, ఏదో ఎమోషన్ ఉందనిపించడం మూలాన కాసిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.
నాలుగు రోజుల క్రితమే తమిళంలో విడుదలైనా అక్కడి టాక్ మిశ్రమ స్పందన పొందిందని తెలిసినా తెలుగు ప్రేక్షకులు విశాల హృదయంతో పండగ సీజన్ ని పురస్కరించుకుని హాలుకొచ్చారు.
వంశీ పైడిపల్లి సినిమాలో రిచ్నెస్ మాత్రం ప్రతి అంగుళంలోనూ కనిపిస్తుంది. ఇందులోనూ రిచ్నెస్ కి కొదవ లేదు.
కథ మొదలౌతూనే రేంజ్ రోవర్లు, రోల్స్ రాయీస్ లు, హెలికాప్టర్లు..అంతా అల్ట్రా రిచ్ వాతావరణం చూపించాడు.
రాజేంద్ర (శరత్ కుమార్) కి ముగ్గురు కొడులు (శ్రీకాంత్, శ్యాం, విజయ్). మూడోవాడైన విజయ్ ఇంట్లో ఉండడు. తాను సొంతగా ఎదగాలని ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకుని ఇంటి నుంచి దూరంగా బతుకుతుంటాడు. మిగిలిన కొడుకులిద్దరూ రాజేంద్ర కంపెనీలో కీలక స్థానాల్లో పని చేస్తుంటారు.
మరో పక్కా జయప్రకాష్ (ప్రకాష్ రాజ్) తన వ్యాపార ఎత్తుగడలతో రాజేంద్రని ఓడించాలనుకుంటూ ఉంటాడు. కానీ అతనిని తన కొడుకులతో కలిసి ఎప్పటికప్పుడు ఎదుర్కుంటూ ఉంటాడు రాజేంద్ర.
ఒకానొక సంఘటన వల్ల మూడో కొడుకు ఇంటికి తిరిగి రావల్సి వస్తుంది. రాజేంద్ర ఏ కొడుకునైతే అక్కర్లేదనుకున్నాడో అతనే తన వ్యాపారానికి కూడా కావాల్సిన వాడౌతాడు. అన్నదమ్ముల మధ్య విభేదాలు, మళ్లీ కలుసుకోవడం ఇవన్నీ అంతర్భాగంగా నడుస్తుంటాయి. ఎన్నో సినిమాల్లో చూసేసిన సగటు రిచ్ కుటుంబం తాలూకు కష్టాల్ని కడతేర్చి మన హీరో కథని కంచికి చెరుస్తాడు. కథగా చెప్పుకోవాలంటే ఇంతే.
తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా చూస్తున్నంతసేపూ అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అల వైకుంఠపురములో వంటి సినిమాల్లోని సన్నివేశాలు గుర్తొస్తుంటాయి. ఈ తరహా సినిమాలు తమిళ ఆడియన్స్ కి విజయ్ మీద చూడడం కొత్త కావొచ్చు. కనుక తెలుగు ఆడియన్స్ కి కొత్త అనుభూతిలాంటిదేమీ కలుగదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి వాళ్లు గతంలో చేసినప్పుడు చూసినట్టే ఇప్పుడు విజయ్ ని కూడా చూడాలంతే.
ఇంత చెప్పుకున్నా ఈ కథ వరకు శ్రద్ధగా రాసుకుని, బుద్ధిగా తెరకెక్కించిన వైనం కనిపిస్తుంది. అహంకారి అయిన తండ్రి అనారోగ్యం తర్వాత ఎలా మారతాడు, అన్నదమ్ముల మధ్య జరిగే తప్పులు, భావోద్వేగాలు అన్నీ సినిమాటిక్ గా మలచి ఒక కాస్ట్లీ కథనాన్ని అందించాడు దర్శకుడు.
కొన్ని సన్నివేశాలకి గతంలో వచ్చిన సినిమాల స్ఫూర్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
బోర్డ్ మీటింగులో పెట్టిన కామెడీ అలరిస్తుంది. అలాగే యోగిబాబుతో విజయ్ కామెడీ కూడా పండింది. ఇక యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండాల్సిన రీతిలో ఉన్నాయి.
సంగీతం పరంగా జస్ట్ ఓకే. రంజితమే పాట ఎనెర్జెటిక్ గా ఉంది. “దళపతి నెకు లెదు పరిమితి” క్యాచీగా ఉంది. మొదటి పాటైతే పూర్తిగా అరవ డబ్బింగ్ వింటున్నట్టే ఉంది.
తెలుగు డబ్బింగ్ రచన మాత్రం బానే ఉంది. తెర మీద విజయ్ కనిపిస్తే తప్ప డబ్బింగ్ సినిమా అని గుర్తురాకుండా ఉంది. ఆ విధంగా ఆ డిపార్ట్మెంట్ పాసైపోయింది. కెమెరా వర్క్ చాలా రిచ్ గా ఉంది. ఎడిటింగ్ కత్తెరకి పదును లేదు. కనీసం 10 నిమిషాలు కోసుండాల్సింది.
నటీనటుల విషయానికొస్తే విజయ్ తన సహజమైన ఈజ్ తో ఆకట్టుకున్నాడు. చేయాల్సిన చోట సటిల్ కామెడీ కూడా పండించాడు.
రష్మిక మాత్రం అందాల ఆరబోత చేసింది తప్ప పాత్రకి పెద్ద డెప్త్ లేదు.
జయసుధ మీద క్లోసప్ పెట్టినప్పుడల్లా ఆందోళనకరమైన ఎక్స్ప్రెషన్ ఇస్తూనే ఉంది. ఆమె పాత్రకి పెద్దగా సన్నివేశాలు పండినవి లేవు.
శరత్ కుమార్ పాత్రకైతే వైవిధ్యానికి స్కోప్ ఉంది. ఫస్టాఫ్ లో పవర్ఫుల్ గా కనపడినా జబ్బు చేసిందని తెలిసాక నీరసమైన ఎక్స్ప్రెషన్ తోనే కంటిన్యూ అయిపోయాడు.
శ్రీకాంత్, శ్యాం ఓకే. శ్రీకాంత్ భార్యగా సంగీతకి ఒకటి రెండు సీన్లు పర్వాలేదనిపించాయి.
పేలవమైన ప్రకాష్ రాజ్ పాత్రరచన, విజయ్-రష్మికల మధ్య ఆకట్టుకోని ట్రాక్ పెద్ద మైనస్ లు.
మొత్తమ్మీద వెండితెర మీద నార్త్ ఇండియన్ ఛానల్లో వచ్చే కాస్ట్లీ టీవీ సీరియల్ చూస్తున్న ఫీలింగొస్తుంది. ఈ పండగ సీజన్లో హెవీ మాస్ సినిమాల నడుమ ఈ కుటుంబ కథాచిత్రం ఒక వర్గం ప్రేక్షకులకి కాస్త పర్వాలేదనిపించవచ్చు. మరీ అంచనాలు పెట్టుకోకుండా, గతంలో చూసిన సినిమాల్లాగే ఉందని పెదవి విరిచేయకుండా పండగ సీజన్లో కుటుంబకథాచిత్రం చూడాలనుకుంటే ప్రస్తుతానికి ఇదొక్కటే ఉంది.
బాటం లైన్: ఫ్యామిలీ టైప్