ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రస్తుతం ఏపీలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీర్రాజు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు చాలా అంశాల్ని ఆయన నెత్తిన పెట్టుకుని వెళ్లనున్నారు. ముఖ్యంగా ఏపీ బీజేపీలో కట్టు తప్పిన క్రమశిక్షణ, అలాగే పవన్‌కల్యాణ్ వ్యవహారశైలిని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే అవకాశం వుందని సమాచారం.
ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించినప్పటి నుంచి కన్నా లక్ష్మినారాయణ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ముఖ్యంగా సోము వీర్రాజుపై ఆయన కారాలుమిరియాలు నూరుతున్నారు. తాను నియమించిన జిల్లా అధ్యక్షుల్ని పనిగట్టుకుని వీర్రాజు తొలగించారని ఇటీవల కన్నా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే జనసేనాని పవన్‌కల్యాణ్‌కు అండగా నిలుస్తానంటూ కన్నా పార్టీ ఆదేశాలను ధిక్కరించి మాట్లాడ్డంపై ఏపీ బీజేపీ గుర్రుగా వుంది.
మరోవైపు టీడీపీతో పొత్తు కుదుర్చుకోనున్నట్టు ఇటీవల పవన్‌కల్యాణ్ బహిరంగంగా వెల్లడించారు. ప్రస్తుతం బీజేపీతో పవన్ అధికారికంగా పొత్తులో ఉన్నారు. జగన్ సర్కార్‌ను గద్దె దించేందుకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని గతంలో బీజేపీ పెద్దల్ని పవన్ అడిగిన సంగతి తెలిసిందే. పవన్ మాటల్ని బీజేపీ పరిగణలోకి తీసుకోలేదు. ఒకవైపు టీడీపీతో పొత్తు వద్దని చెప్పినా పవన్ మాత్రం పట్టించుకోలేదు. బీజేపీతో కలిసి వెళితే మరోసారి ఓటమి తప్ప, మరేమీ దక్కదని జనసేనాని ఆలోచనగా వుంది.
ఈ పరిస్థితులను బీజేపీ అధిష్టానం దృష్టికి సోము వీర్రాజు తీసుకెళ్లనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి వ్యూహంతో వెళ్లాలో బీజేపీ అధిష్టానం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా పవన్ వైఖరి, ఆయనతో ఎలా ఉండాలో కూడా పార్టీ సూత్రప్రాయంగా చెప్పే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.