మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బాబుకు క్యారెక్టర్ లేదని ఈసడించుకున్నారాయన. సంక్రాంతి సంబరాలను సొంతూరులో చేసుకోడానికి నారావారిపల్లెకు నారా, నందమూరి కుటుంబాలు వెళ్లిన సంగతి తెలిసిందే. భోగిని పురస్కరించుకుని మంటల్లో జీవో నంబర్-1 పత్రాలను కాల్చిన చంద్రబాబు ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేశారు.
ముఖ్యంగా పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారాయన. పుంగనూరులో ఎలా గెలుస్తావో చూస్తానని బాబు హెచ్చరించారు. 175కు 175 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు అన్నారు. భవిష్యత్‌లో మంత్రి పెద్దిరెడ్డి అంతు చూస్తానని హెచ్చరించిన నేపథ్యంలో కౌంటర్ ఇచ్చేందుకు ఆయన మీడియా ముందుకొచ్చారు. చంద్రబాబు పండగ పూట కూడా రాజకీయాలు చేస్తున్నారని తప్పు పట్టారు. ఓటమి భయంతోనే తనపై చంద్రబాబు విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఎప్పుడూ ఏడ్చే పరిస్థితే అన్నారు. బాబును చూస్తే బాధేస్తోందన్నారు.
ఏదో ఒక నెపంతో ముఖ్యమంత్రి జగన్‌పై బాబు ఏడుస్తుంటారన్నారు. అప్పుడప్పుడు జిల్లాకు వచ్చినప్పుడు తనపై ఏడుస్తుంటాడని దెప్పి పొడిచారు. పుట్టుకతోనే చంద్రబాబుకు ఏడ్పుగొట్టు లక్షణం వచ్చిందన్నారు. దీనికి ప్రధాన కారణం సొంత జిల్లా చిత్తూరులో టీడీపీకి ఎప్పుడూ ఆదరణ లేకపోవడమే అన్నారు. ఇప్పుడు కుప్పంలో కూడా తనకు గడ్డు పరిస్థితులు ఎదురుకావడంతో బాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. పుంగనూరులో రౌడీయిజం చేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకోవాలా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.
తననేదో చేస్తానని చంద్రబాబు హెచ్చరించడాన్ని పెద్దిరెడ్డి ప్రస్తావించారు. ఇంతకు ముందు ఏం చేశావని ఆయన ప్రశ్నించారు. చేతనైతే నువ్వు ఊరుకునేవాడివా అని బాబును నిలదీశారు. ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమంగా కేసు పెట్టి జైల్లో పెట్టావని, అలాగే పుంగనూరులో అభివృద్ధి కార్యకలాపాలు నిలిపివేశావని, ఈ సంగతులు గుర్తు లేవా? అని ప్రశ్నించారు. వీలైతే ఏం చేయడానికైనా బాబు సిద్ధహస్తుడన్నారు. చేతకాకే నిస్సహాయంగా ఉన్నాడన్నారు. కారుకూతలు కూస్తే సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరని బాబును హెచ్చరించారు. మతి చలించిపోయి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని పెద్దిరెడ్డి అన్నారు.
చిత్తూరు జిల్లాకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలాడిన టీడీపీకి భవిష్యత్ వుండదన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. తనపై చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజాలు లేవన్నారు. కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటే అన్నారు. ఈ దఫా కుప్పంలో టీడీపీ జెండా పీకేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు హంద్రీనీవా పూర్తి చేయలేకపోయారని ఆయన విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.