బాబు కోసం వైసీపీ వెయిట్‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాక‌కోసం కుప్పంలో వైసీపీ నేత‌లు ఎదురు చూస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీకి ఈ నెల 15న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌లు చంద్ర‌బాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కుప్పం మున్సిపాలిటీలో…

టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాక‌కోసం కుప్పంలో వైసీపీ నేత‌లు ఎదురు చూస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీకి ఈ నెల 15న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌లు చంద్ర‌బాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కుప్పం మున్సిపాలిటీలో పాగా వేసి, బాబు ప‌ని అయిపోయింద‌నే సంకేతాల్ని ఇవ్వాల‌ని వైసీపీ శ‌క్తి వంచ‌న లేకుండా శ్ర‌మిస్తోంది.

14వ వార్డు టీడీపీ అభ్య‌ర్థి ఉప‌సంహ‌ర‌ణ విష‌య‌మై తీవ్ర వివాదం నెల‌కుంది. ఫోర్జ‌రీ సంత‌కాలు చేసి విత్‌డ్రా  నాట‌కం ఆడుతున్నార‌ని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ వైఖ‌రిని నిర‌సిస్తూ కుప్పం మున్సిపాలిటీ ఎదుట టీడీపీ నాయ‌కులు, కార్య‌కర్త‌లు గ‌త సోమ‌వారం రాత్రి ఆందోళ‌నకు దిగిన విష‌యం తెలిసిందే. కుప్పంలో వైసీపీ ఆగ‌డాలు పెరిగిపోవ‌డంతో స్వయంగా చంద్ర‌బాబే అక్క‌డికి వెళుతున్నార‌ని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. అయితే చంద్ర‌బాబు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ వెళ్ల‌లేదు.

అమ‌రావ‌తి నుంచే ఆయ‌న కుప్పంలో ఎన్నిక‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న టీడీపీ నాయ‌కుల‌తో మాట్లాడారు. ‘అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు మనమీద బనాయిస్తున్న అక్రమ కేసులకు ఏ ఒక్కరూ భయపడొద్దు. నేనున్నా, వర్కవుట్‌ చేస్తున్నా. న్యాయ పోరాటం చేద్దాం. ప్రజల్లోకి వెళ్లండి’ అంటూ చంద్రబాబు కుప్పం టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ఆయ‌న పార్టీ ముఖ్య నేతలు, వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులు, కో ఆర్డినేటర్లతో  టెలికాన్ఫరెన్సు నిర్వహించారు.  

ఇదిలా వుండ‌గా చంద్ర‌బాబును ఎలాగైనా కుప్పం ర‌ప్పించాల‌ని వైసీపీ వ్యూహం ర‌చించిన‌ట్టు స‌మాచారం. కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక కోసం ఆయ‌న్ను ఇంటింటికి తిప్పించి, ఓడించాల‌నేది వైసీపీ ఎత్తుగ‌డ‌గా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే టీడీపీ స్థానికేతరులైన నాయ‌కుల‌ను అరెస్ట్ చేసి, ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కూ రావ‌ద్ద‌ని పోలీసులు హెచ్చ‌రించారు. అంటే ఇప్పుడు కుప్పం టీడీపీ శ్రేణుల‌కు భ‌రోసా క‌లిగించ‌డానికి చంద్ర‌బాబే త‌ప్ప‌ని స‌రిగా వెళ్లాల్సిన‌ ప‌రిస్థితిని వైసీపీ క‌ల్పించింది.

జాతీయ స్థాయిలో విష్ణు చ‌క్రాలు, బొంగ‌రాలు తిప్పాన‌ని గొప్ప‌లు చెప్పుకునే చంద్ర‌బాబుని మున్సిపాలిటీ స్థాయికి దిగ‌జార్చాల‌నేది వైసీపీ వ్యూహం. స్వ‌యంగా చంద్ర‌బాబే ప్ర‌చారం చేసినా, కుప్పంలో గెల‌వ‌లేదంటూ ఉధృతంగా జ‌నంలోకి తీసుకెళ్లేందుకు అధికార పార్టీ అన్ని ర‌కాల అస్త్రాల‌ను సిద్ధం చేసుకుంది. 

ఈ ప‌రిస్థితుల్లో కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల కోసం కుప్పానికి చంద్ర బాబు వెళ్ల‌డ‌మా లేక అమ‌రావ‌తిలోనే వుంటూ పార్టీ శ్రేణుల్ని గాలికి వ‌దిలేయ‌డ‌మా? ఇది ఇప్పుడు ఆయ‌న ముందున్న ప్ర‌శ్న‌. కానీ చంద్ర‌బాబు రాక కోసం టీడీపీ కంటే వైసీపీ శ్రేణులే ఎదురు చూస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు.