ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు భలే సరదా మనిషి. సీరియస్ విషయాన్ని కూడా తమషాగా చెప్పడం ఆయనకే చెల్లింది. ఒకవైపు జనసేన తనను కాదని పక్క చూపులు చూస్తున్నా ఇంకా తనతోనే ఉందని ఆయన చెప్పడం హాస్యం కాక మరేంటి? ఇలాంటి మాటలు చెప్పి, తనను తాను మోసం చేసుకుంటున్నారా లేక జనాన్ని మోసం చేస్తున్నారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
సోము వీర్రాజు ఎంతగా చతురాడుతున్నారంటే ఒక్కసారి ఆయన మాటలు వింటే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీతో మినహా ఇంకే పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. జనసేన-బీజేపీ పొత్తు ఉన్న పార్టీలన్నారు. ఇంకెవరికీ తాము తోక పార్టీలు కాదని ఆయన తేల్చి చెప్పారు.
సోము వీర్రాజు దృష్టిలో ఆయన చెప్పింది కరెక్టే. బీజేపీకి జనసేన పార్టీతో మినహా మరెవరితో పొత్తు లేకపోయి ఉండొచ్చు. కానీ టీడీపీతో తమకు పొత్తు లేదని, భవిష్యత్లో ఉండదని ఆయన ఎలా చెబుతారని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు.
జగన్ను ఎదుర్కోవాలంటే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకుందని జనసేన నాయకులు చెబుతున్న మాట. తమ అభిప్రాయాల్ని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజే ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్న వాళ్లకు ఆన్సర్ ఏంటి సార్?