పెళ్లి చేసుకున్న మ‌లాలా

మలాలా యూసఫ్‌జాయ్‌… ప్ర‌పంచానికి సుప‌రిచిత‌మైన పేరు. పాకిస్థాన్‌కు చెందిన యువ‌తి. ఉగ్ర‌వాదుల తూటాల బారిన ప‌డి మృత్యువును జ‌యించిన బాలిక‌గా ప్ర‌పంచ ప్ర‌శంస‌లు పొందింది. పాకిస్థాన్‌లో వుంటే ప్రాణాల‌కు ముప్పు అని భావించి బ్రిట‌న్‌లో…

మలాలా యూసఫ్‌జాయ్‌… ప్ర‌పంచానికి సుప‌రిచిత‌మైన పేరు. పాకిస్థాన్‌కు చెందిన యువ‌తి. ఉగ్ర‌వాదుల తూటాల బారిన ప‌డి మృత్యువును జ‌యించిన బాలిక‌గా ప్ర‌పంచ ప్ర‌శంస‌లు పొందింది. పాకిస్థాన్‌లో వుంటే ప్రాణాల‌కు ముప్పు అని భావించి బ్రిట‌న్‌లో కుటుంబంతో స‌హా స్థిర‌ప‌డింది. ప్ర‌స్తుతం ఆ 24 ఏళ్ల యువ‌తి వివాహ జీవితంలో అడుగు పెట్టి, మ‌రోసారి వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచింది.

బ్రిట‌న్‌లోని బ‌ర్మింగ్‌హ‌మ్‌లో త‌న ఇంట్లో కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో అస్స‌ర్‌తో మ‌లాలాకు పెళ్లి జ‌రిగింది. ఈ విష‌యాన్ని జీవిత భాగ‌స్వామి అస్స‌ర్‌తో క‌లిసి ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా లోకానికి తెలియ‌జేశారు.

‘ నా జీవితంలో ఈ రోజు ఎంతో ముఖ్యమైంది. అస్సర్‌, నేను జీవిత భాగస్వాములు అయ్యాం. బర్మింగ్‌హమ్‌లోని మా ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించాం. మీ ఆశీస్సులు మాకు పంపించండి. భార్యభర్తలుగా కొత్త ప్రయాణం కలిసి సాగించడానికి సంతోషంగా ఉన్నాం’ అని మలాలా ట్వీట్‌ చేశారు. తన భర్త అస్సర్‌తో దిగిన ఫొటోలను ఆమె పంచుకున్నారు.  

బాలిక‌ల విద్య కోసం ఆమె పోరాటం సాగిస్తున్నారు. ఆమె సేవ‌ల్ని గుర్తించి 2014లో మ‌లాలాకు నోబెల్ శాంతి బ‌హుమ‌తి పుర‌స్కారాన్ని అంద‌జేశారు. 17 ఏళ్ల అతిచిన్న వ‌య‌సులో అత్యున్న‌త పుర‌స్కారం అందుకున్న యువ‌తిగా మ‌లాలా గుర్తింపు పొందారు. 2020లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకనామిక్స్‌లో ఆమె డిగ్రీ పట్టా పొందారు.