రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఆనందంగా, ప్రశాంతంగా ఫిడేలు వాయించుకుంటూ వుండేవాడనే చందాన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ వ్యవహారశైలి ఉంది. ఈ రకం విమర్శలు టీడీపీ నుంచే రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కంచుకోటైన కుప్పం రాజకీయంగా తగలబడుతుంటే నారా లోకేశ్ నీరో చక్రవర్తి మాదిరిగా ఫిడేలు వాయించుకుంటున్నారా? అని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
టీడీపీ మున్సిపాలిటీ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని నాయకులు, కార్యకర్తలు అధికార పార్టీతో గట్టిగా ఫైట్ చేస్తున్నారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయ, గందరగోళ పరిస్థితుల్లో టీడీపీ శ్రేణులున్నాయి.
ఈ నేపథ్యంలో కుప్పంలో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు సృష్టిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే కారణంతో స్థానికేతరులైన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి అమరనాథరెడ్డి, టీడీపీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు తదితరులను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు.
14వ వార్డు టీడీపీ అభ్యర్థి ప్రకాశ్ నామినేషన్ విత్‌డ్రా విషయమై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించుకున్నట్లు చూపి, వైసీపీ అభ్యర్థిని అధికారులు ఏకగ్రీవం చేశారని ఆరోపిస్తూ సోమవారం రాత్రి టీడీపీ శ్రేణులు కుప్పం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించాయి. తన విధులకు ఆటంకం కలిగించారని ఎన్నికల అధికారైన కమిషనర్ ఫిర్యాదు మేరకు 19మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇతర జిల్లాలనుంచి వచ్చిన వారు కుప్పంలో అరాచకం సృష్టిస్తున్నారని, వారు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ గంగయ్య హెచ్చరించారు. అనంతరం ఒక హోటల్లో ఉన్న మాజీ మంత్రి అమరనాథరెడ్డి, నాని లను పోలీసులు అరెస్ట్ చేశారు. కుప్పం విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇదే రకంగా నిమ్మల రామానాయుడు, ఇతర నాయకులను కూడా పోలీసులు అర్ధరాత్రి ఒంటిగంటకు అరెస్ట్ చేశారని సమాచారం. ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ వారెవరూ కుప్పంలో కనిపించకూడదని పోలీసులు తేల్చి చెప్పారు.
ప్రస్తుతం కుప్పంలో టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో దిక్కుతోచని పరిస్థితి. కనీసం ఇలాంటి కష్టకాలంలోనైనా తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులకు అండగా నిలవాలన్న తపన లోకేశ్‌లో కనిపించకపోవడంపై కార్యకర్తలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాగైతే పార్టీ కోసం గట్టిగా ఎవరు నిలబడుతారని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్న లోకేశ్… నయా నీరోచక్రవర్తిగా మారిపోయారని టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కనీసం ఇప్పటికైనా లోకేశ్ సీరియస్‌గా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది.