చంద్రబాబుకి ‘అదొక్కటే’ తెలుసు

కంపెనీల్లో మేనేజర్లుంటారు. వాళ్లు కిందవారికి పని పురమాయించడం తప నేరుగా ఫీల్డులోకి దిగరు. కింది వాళ్లు కష్టపడి ఏం సాధించినా క్రెడిట్ మాత్రం బుట్టలో వేసుకుంటారు.  Advertisement మేనేజర్ల కింద పనిచెయ్యడంలో ఒత్తిడి ఉంటుంది.…

కంపెనీల్లో మేనేజర్లుంటారు. వాళ్లు కిందవారికి పని పురమాయించడం తప నేరుగా ఫీల్డులోకి దిగరు. కింది వాళ్లు కష్టపడి ఏం సాధించినా క్రెడిట్ మాత్రం బుట్టలో వేసుకుంటారు. 

మేనేజర్ల కింద పనిచెయ్యడంలో ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులకి జీతం తీసుకున్నప్పుడు తప్ప తక్కిన సమయాల్లో ఆనందం ఉండదు. 

గాలివాటం మీదో, వేరొకరి కష్టం వల్లో, సుడి తిరిగో కంపెనీకి లాభాలొస్తే అవన్నీ తాను మేనేజరుగా ఉన్నప్పుడు చేసిన ఘనకార్యాలుగా మీటింగుల్లో చెప్పుకుంటూనే ఉంటారు. తనది కానిది తనదిగా చెప్పుకునే నైజం మ్యానేజర్లలో ఉంటుంది. 

“ఇదంతా నేనే చేసాను. ఈ ఆఫీసు నిర్మాణానికి వాడిన ప్రతి సిమెంటు రేణువు నా కష్టార్జితమే” అని చెప్పుకుంటారు. 

కింది ఉద్యోగులముందు తమ సీనియారిటీని గుర్తుచేస్తుంటారు. తాను ఎన్ని గంటలు కష్టపడేవాడినో చెప్పుకుంటారు. 

ఈ మ్యానేజర్లు అన్నీ దూరం నుంచే పర్యవేక్షిస్తారు తప్ప దగ్గరకెళ్లరు. వీళ్లకి ఎమోషన్స్ ఉండవు. కంపెనీ భవిష్యత్తు, తమ కుర్చీ మాత్రమే ముఖ్యం. దానికోసం ఏ పనైనా చేస్తారు.

పోటీనిస్తున్న పక్క కంపెనీలో బాగా పనిచేస్తున్నవాడుంటే వాడికి ఎక్కువ జీతం ఆశచూపి లాక్కొచ్చేయడం, వ్యవస్థల్లోని పెద్దలతో సత్సంబంధాలు పెట్టుకుని అనుమతులు త్వరగా తెచ్చుకోవడం, తక్కువ రేటుకి ల్యాండు సంపాదించి వ్యాపారాన్ని విస్తరించుకోవడం…ఇలాంటివన్నీ చేస్తుంటారు. 

రాజకీయ నాయకుడి మనస్తత్వం ఎలా ఉంటుందో అందరికీ అనుభవం ఉండకపోవచ్చుకానీ ఉద్యోగాలు చేసే ప్రతివారికి సగటు మేనేజర్లు ఎలా ఉంటారో తెలుసు. 

చంద్రబాబు నాయుడు కేవలం మేనేజర్ మాత్రమే, లీడర్ కాదు అని చెప్పడానికే ఇదంతా చెప్పడం తప్ప మేనేజర్స్ ని కించపరచడానికి కాదు. నిజానికి మేనేజర్లనేవాళ్లు అలానే ఉండాలి. 

మరి లీడర్లంటే ఎవరు? వీళ్లు కిందివాళ్లకి పని పురమాయించరు. అసలు “కిందివాళ్లు” అనే భావన రానీయరు. అందర్నీ తమతో సమానంగా చూస్తారు. మాటలతో స్ఫూర్తినిచ్చి వదిలేస్తారు. ఆ స్ఫూర్తితో సహోద్యుగులు వాళ్లు తమకున్న ప్రతిభని, కష్టాన్ని ధారపోస్తారు. 

లీడర్ల దగ్గర పనిచేయడంలో ఆనందం ఉంటుంది ఒత్తిడి ఉండదు. 

లీడర్లు ఎవరి క్రెడిట్టునో తమ ఖాతాలో వేసుకోరు. తమ కష్టఫలాన్ని కూడా తనతో పని చేసేవారికి కట్టబెట్టి మనసుల్ని గెలుచుకుంటారు. 

“ఇది నా ఒక్కడి కృషి కాదు. సమిష్టి కృషి” అంటారు లీడర్లు. 

వీళ్లు తమ సీనియారిటీని పదే పదే చెప్పుకోరు. 

ఎంతసేపూ హ్యూమన్ టచ్ తో మనసుల్ని గెలుచుకునే ప్రయత్నాలే చేస్తుంటారు.  

ఫీల్డులోకి దిగి కష్టపడతారు. కష్టాలు తెలుసుకుంటారు. 

వ్యవస్థల్ని వాడుకోవాలనే ఆలోచన వీళ్లకుండదు. వ్యాపార విస్తరణకంటే మనుషులతో బంధాన్ని పెంచుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. 

వీళ్లకి ఎమోషన్స్ ఉంటాయి. పక్క కంపెనీల్లోని ఉద్యోగుల్ని వలేసి పట్టుకోరు. తమ ఉద్యోగులుకే స్ఫూర్తినిచ్చి సమర్థులుగా తీర్చి దిద్దుకుంటారు. 

ఇలాంటి లీడర్లు సాధారణంగా కంపెనీల్లో చాలా అరుదుగా ఉంటారు. 

చంద్రబాబునాయుడు ఇప్పుడు కుప్పంలోని స్థానిక ఎన్నికల కోసం పడుతున్న పాట్లు చూస్తుంటే బాధేస్తుంది. ప్రధానమంత్రుల్ని నిలబెట్టానని చెప్పుకునే ఆ 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇప్పుడు కుప్పంలో పిల్లుమొగ్గలేస్తోంది. అక్కడ నెగ్గితే మళ్లీ ముఖ్యమంత్రి అయినంత ఆనందం పొందేలా ఉన్నాడాయన. 

ఇంత బలంగా విజయం కోరుకుంటున్నా కనీసం ఒక్క సారైనా ఓటర్లతో మమేకమయ్యి లీడరనిపించుకోవాలనుకోవడంలేదు. ఎందుకంటే ఆయన నాడి, నరం, నెత్తురు, కండ అంతా మేనేజ్మెంటే తప్ప లీడర్షిప్పు లేదు. చంద్రబాబుకి మ్యానేజ్మెంటు ఒక్కటే తెలుసు. 

పాలకపక్షమ్మీద దుమ్మెత్తి పోయడం, తొండాట ఆడుతున్నారని ఆరోపించడం తప్ప జనంలోకి వెళ్లి మనసుల్ని గెలుచుకుందామనే పని పెట్టుకోవడంలేదు. 

ఎన్నో విషయాలు కలిసొస్తే తప్ప మేనేజర్లు పాలకులు కాలేరు. మానవత్వంతో ప్రజల మనసుల్ని గెలుచుకునే లీడర్లు ఏ కుట్రలు చెయ్యకుండానే పాలకులౌతారు. ఈ మర్మం గ్రహించే నాటికి చంద్రబాబు జీవితం అయిపోయేలా ఉంది. 

ఆయనని మరో సారి సీయం గా చూడాలని కోరుకునే మా బంధుగణానికి ఆ కోరిక తీరుతుందో లేదో. వారి కోరిక తీర్చడానికైనా ఈయన మేనేజరు పంథా మార్చుకుని లీడరైతే బాగుండు. 

హరగోపాల్ సూరపనేని