మావోయిస్టులు గంజాయి విషయంలో స్పందించారా. వారి మాట అదేనా అంటే. ఏమో తెలియదు కానీ విశాఖ ఏజెన్సీలో వెలసిన కొన్ని పోస్టర్లు చూస్తే మావోలు గంజాయి సాగుకు తాము వ్యతిరేకమని చెప్పుకుంటున్నారు కానీ అదే సమయంలో గిరిజనులకు ఎటువంటి ఉపాధి చూపించకుండా గంజాయి సాగును ఎలా ద్వంసం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
గిరిజనులకు సరైన ఉపాధి అవకాశాలు చూపించాలని వారు డిమాండ్ చేస్తున్నట్లుగా పోస్టర్ల ద్వారా తెలుస్తోంది. విశాఖ జిల్లా, జి.మాడుగుల మండలం, బొయితిలి పంచాయతీ, మద్దిగరువులో మావోయిస్టుల పోస్టర్లు స్థానికంగా కలకలం రేపాయి. అంటే గంజాయి పంటలను ఇపుడు పెద్ద ఎత్తున ఏజెన్సీలో ద్వంసం చేయడం పట్ల మావోలు ఆగ్రహంగా ఉన్నారా అన్న చర్చ అయితే వస్తోంది.
అయితే గిరిజనుల ఉపాధి విషయంలో మాత్రమే మావోలు తమ మద్దతు తెలిపారని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే మావోల పేరిట ఎవరైనా ఇలా చేస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా మావో అగ్ర నేత ఆర్కే మరణించాక ఉద్యమం కొంత తగ్గిందన్న వార్తల నేపధ్యమో మావోల పేరిట పోస్టర్లు వెలియడం అంటే ఏజెన్సీలో సంచలనంగానే చూస్తున్నారు.
అదే విధంగా ఆపరేషన్ పరివర్తన్ పేరిట పోలీసులు ఏవోబీలో దూకుడు చేయడం పట్ల కూడా మావోల హెచ్చరికగానే చూస్తున్నారు. మొత్తానికి గిరిజనులకు వాణిజ్య పంటలను అలవాటు చేయాలని, ఉపాధిని పెంచి వారి జీవిత ప్రమాణాలను బాగు చేయాలని డిమాండ్ వారి నుంచి ఉంది అంటున్నారు.