మాజీ మంత్రి అఖిలప్రియ పరువు బజారు పడింది. అప్పులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సమీప బంధువులే ఆమె ఇంటి ఎదుట నిరవధిక ధర్నాకు దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల నంద్యాల బ్యాంక్ అధికారులు కూడా రుణం చెల్లించాలంటూ ఆమె ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యక్తిగత అప్పులకు సంబంధించి అఖిలప్రియ ఎంతకూ పలకకపోవడంతో పాటు తాను చెల్లించనని మొండికేయడంతో సమీప బంధువులు ఆమె ఇంటి వద్ద ఆందోళనకు దిగడం గమనార్హం.
దివంగత భూమా నాగిరెడ్డి అన్న భాస్కర్‌రెడ్డి కుమార్తె ఉమామహేశ్వరి పలు దఫాలుగా తన చిన్నాన్న నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియలకు సుమారు రూ.11 కోట్లు ఇచ్చారు. ఇక వడ్డీతో కలిపితే భారీ మొత్తం అవుతుంది. ఈమెతో పాటు నాగిరెడ్డి పెద్దన్న ప్రతాప్‌రెడ్డి కుమార్తె రాజీ కూడా రూ.2 కోట్లు తన చిన్నాన్న కుటుంబానికి అప్పుగా ఇచ్చారు. మరోవైపు తాము బంధువులు, మిత్రుల వద్ద అప్పు తీసుకొచ్చి మరీ చిన్నాన్నకు కష్ట సమయంలో ఇచ్చామని వారు చెబుతున్నారు.
ప్రతినెలా అప్పులకు పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని, సోదరైన అఖిలప్రియ చెల్లించకుండా మొండికేసిందని వారు వాపోతున్నారు. అప్పుల వాళ్ల ఒత్తిళ్లతో తీవ్ర మానసిక వేదనకు గురి అవుతున్నామని, తమకు అఖిలప్రియ వడ్డీతో సహా అసలు ఇవ్వకపోతే భవిష్యత్ అంధకారం అవుతుందని ఆ ఆడబిడ్డలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండురోజులుగా అఖిలప్రియ ఇంటికెళ్లి అప్పులు చెల్లించాలని డిమాండ్ చేసినా, ప్రయోజనం లేదని వారు వాపోతున్నారు. మరోవైపు అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ అవమానకరంగా మాట్లాడుతున్నారని వారు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఇంటి ముందు భూమా భాస్కర్‌రెడ్డి కుమార్తె మహేశ్వరి, ఆమె భర్త బూచుపల్లి మురళీధర్‌రెడ్డి, భూమా ప్రతాప్‌రెడ్డి కుమార్తె రాజీ, ఆమె భర్త, గుంతకల్లుకు చెందిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ సాయి మహేశ్వరరెడ్డిలతో పాటు వీరికి మద్దతుగా భూమా నాగిరెడ్డి చిన్నాన్న కుమారుడు, దొర్నిపాడు మాజీ ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, ఆయన కుమారుడైన తెలుగు యువత రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ భూమా సంతోష్‌రెడ్డి నిరసనకు దిగారు.
మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అఖిలప్రియ పరువు కాస్త బజారుపాలైందనే చర్చ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇదిలా వుండగా ఇంట్లో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి ఉన్నారు. చివరికి ఈ వ్యవహారం ఏ మలుపు తిరగనుందో చూడాలి.