ఎంవీ గంగా విలాస్. ప్రపంచంలోనే అతి పెద్ద నదీ పర్యాటక నౌకగా ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది ఈ క్రూయిజ్ వెసెల్. భారతీయ టైటానిక్ గా దీన్ని పొగిడేస్తున్నారంతా. వారణాసి నుంచి అసోంలోని దిబ్రూఘర్ వరకు దీని ప్రయాణం కొనసాగుతుంది. గంగా నదిలో ఈ భారీ నౌక ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. ఇంతకీ ఈ గంగా విలాస్ ప్రత్యేకతలేంటంటే..!!
ఎక్కడి నుంచి ఎక్కడి వరకు..?
భారతదేశంలో తయారుచేసిన మొట్టమొదటి క్రూయిజ్ నౌక ఇది. వారణాసి నుంచి అసోంలోని దిబ్రూఘర్ వరకు 51 రోజుల్లో 3,200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 32 మంది స్విట్జర్లాండ్ పర్యాటకులు ఇందులో ఫస్ట్ ట్రిప్ వెళ్తున్నారు. వారణాసి దిబ్రూఘర్ మధ్యలో బంగ్లాదేశ్ జలాల్లోనూ ఈ నౌక ప్రయాణం చేస్తుంది. రెండు దేశాల్లో 27 నదుల గుండా సాగే గంగా విలాస్ ప్రయాణ మార్గంలో 50 ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను వీక్షించే అవకాశం ఉంటుంది.
ఎంతమంది ప్రయాణిస్తారు..?
ఫైవ్ స్టార్ హోటళ్లను తలదన్నేలా ఉన్న ఈ ఫైవ్ స్టార్ మూవింగ్ హోటల్ లో 36 మందికి సరిపోయేలా అన్ని సౌకర్యాలున్నాయి. 18 సూట్ రూమ్ లు ఉన్నాయి. 40 మంది సిబ్బందికి కూడా అదనంగా వసతి ఉంది.
కాలుష్యం ఉంటుందా..?
ఈ భారీ పర్యాటక నౌక పొడవు 62 మీటర్లు. వెడల్పు 12 మీటర్ల. మూడు సన్ డెక్ లు ఉంటాయి. దీనికి లంగరు వేయాలంటే 1.4 మీటర్ల డ్రాఫ్ట్ అవసరం. ఇందులో స్పా, సెలూన్, జిమ్ వంటి ఆధునిక సౌకర్యాలు కూడా ఉన్నాయి. దీని ద్వారా కాలుష్యం వెలువడదు, సౌండ్ పొల్యూషన్ అసలే ఉండదు. అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని తయారు చేశారు.
గంగను కలుషితం చేస్తుందా..?
గంగా నదిలోకి మురుగు ప్రవహించకుండా ఇందులో మురుగునీటి ప్రాసెస్ యూనిట్ ఉంది, అలాగే స్నానం మరియు ఇతర అవసరాల కోసం గంగాజలాన్ని శుద్ధి చేసే ఫిల్టరేషన్ ప్లాంట్ కూడా ఉంది.
గంగా విలాస్ లో ఒకరోజు ఉండాలంటే..?
గంగా విలాస్ ప్రయాణానికి రోజుకు 25 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు చార్జ్ చేస్తారు. ఆ లెక్కన మొత్తం 51 రోజుల ప్రయాణానికి ఒక్కో ప్రయాణికుడికి దాదాపు 20 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు గంగా విలాస్ డైరెక్టర్ రాజ్ సింగ్.
వారణాసిలో మొదలైన ఈ గంగా విలాస్ ప్రయాణాన్ని వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో మరికొన్ని ప్రాంతాల్లో ఇటువంటి నదీ పర్యాటక నౌకలు వస్తున్నాయని తెలిపారాయన.