ప్రపంచం మెచ్చిన కేరళ అందం..!

గాడ్స్ ఓన్ ల్యాండ్.. దేవుడి సొంత ప్రాంతం.. కేరళకు ఆ పేరు ఎందుకొచ్చిందో తెలియదు కానీ, ఆ ప్రత్యేకత మాత్రం ఆ రాష్ట్రానికి ఉందని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. జాతీయ స్థాయిలో కేరళ అందాలను…

గాడ్స్ ఓన్ ల్యాండ్.. దేవుడి సొంత ప్రాంతం.. కేరళకు ఆ పేరు ఎందుకొచ్చిందో తెలియదు కానీ, ఆ ప్రత్యేకత మాత్రం ఆ రాష్ట్రానికి ఉందని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. జాతీయ స్థాయిలో కేరళ అందాలను మనం పొగుడుకోవడమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాలు కూడా కేరళ అందాలను ప్రశంసిస్తున్నాయి. ప్రపంచంలో చూడదగ్గ 52 బెస్ట్ ప్రాంతాల్లో భారత్ నుంచి చోటు సంపాదించుకున్న ఏకైక ప్రాంతం కేరళ.

2023 కొత్త ఏడాది.. పర్యాటకులకు ప్రపంచంలోని ది బెస్ట్ 52 ప్లేసెస్ అంటూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ఇచ్చింది. వారానికో ప్రాంతం చుట్టేసినా 52 వారాల్లో ఈ ఏడాదిని అద్భుతంగా ముగించేయొచ్చనే ఉద్దేశంతో 52 ప్రాంతాలను సూచించింది. అందులో భారత్ నుంచి స్థానం సంపాదించిన ఒకే ఒక్క ప్రాంతం కేరళ. అవును.. గాడ్స్ ఓన్ ల్యాండ్ గా పేరున్న కేరళ.. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. తనకున్న ప్రత్యేకతను కాపాడుకుంటోంది.

పచ్చని పర్యావరణం, ప్రకృతి అందాలు..

కేరళ పర్యాటకం పూర్తిగా పర్యావరణంతో ముడిపడి ఉంది. ఓవైపు పూర్తిగా అరేబియా సముద్రం, మరోవైపు తమిళనాడు, కర్నాటక సరిహద్దులతో కేరళ, అత్యంత ఆహ్లాదంగా ఉండే పశ్చిమ తీర రాష్ట్రం. కేరళ కంటే ఎక్కువ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాలు ఉన్నా కూడా.. తుపానులు అక్కడ పర్యావరణాన్ని అతలాకుతలం చేస్తుంటాయి. కానీ కేరళలోని ప్రత్యేక పరిస్థితులు సముద్ర తీరాన్ని ఎప్పుడూ ఆహ్లాదంగానే ఉంచుతాయి. అక్కడి బీచ్ లే కాదు, సముద్రపు బ్యాక్ వాటర్ తో కనిపించే సరస్సులు కూడా పర్యాటక రంగానికి కలిసొచ్చాయి.

వంటకాలు సూపర్బ్..

కేరళ వంటకాలు వెరీ స్పెషల్. ముఖ్యంగా కొబ్బరి నూనెతో చేసే వంటకాలు సరికొత్త రుచులను ఆస్వాదించేవారిని ఎప్పుడూ నిరాశపరచవు. పర్యాటక ప్రాంతాల్లో కొన్నిచోట్ల ప్రదేశాలు బాగుంటాయి, మరికొన్ని చోట్ల వంటకాలు బాగుంటాయి, ఇంకొన్ని చోట్ల పురాతన సంప్రదాయాలు ఆకర్షిస్తాయి. కానీ కేరళలో ఈ మూడూ పర్యాటకుల్ని అలరిస్తాయి.

కుమరకోమ్ గ్రామంలో కొబ్బరి పీచుతో తాళ్లు నేయడం, కాలువల్లో తెడ్డు ద్వారా ప్రయాణించడం, తాటి చెట్టు ఎక్కడం వంటివి పర్యాటకులను సరికొత్త వినోదాన్ని అందిస్తాయి. కొట్టాయం జిల్లాలోని మరవన్తురుత్తు సంప్రదాయ కళారూపాలకు పెట్టింది పేరు. సంప్రదాయ నృత్యగానాలతో ఇక్కడ ప్రపంచాన్నే మైమరచిపోవచ్చు.

కేరళ ఆయుర్వేద చికిత్సలకు కూడా ఫేమస్. కేరళలోని ఆయుర్వేదం, మసాజ్ థెరపీని చాలా ఇష్టపడతారు. కేరళ పర్యాటకులు ఈ ఆయుర్వేద వైద్య విధానాల గురించి కూడా తెలుసుకోవచ్చు. అందుకే కేరళ.. ప్రపంచంలోని అత్యుత్తమ పర్యాటక ప్రాంతాల సరసన నిలిచింది.

పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లేకపోయినా, అబ్బురపరిచే ఆకాశ హర్మ్యాలు లేకపోయినా, వినోదాల కోసం బార్లు, పబ్బులు వంటివి లేకపోయినా పర్యాటకుల్ని కేరళ విశేషంగా ఆకర్షిస్తోంది, కావాల్సినంత వినోదాన్ని అందిస్తోంది, జీవితానికి సరిపోయే మధురానుభూతుల్ని మిగుల్చుతుంది.