ముస్లిం యువతి ఏ వయసులో పెళ్లి చేసుకోవచ్చు..?

భారతదేశంలో చట్టం అందరికీ ఒకటే అయినా వివాహాలు, విడాకులు, వారసత్వాల విషయంలో.. ముస్లిం లా, క్రిస్టియన్ లా వేర్వేరుగా ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు సాధారణ చట్టాలతో వీటికి ఘర్షణ తలెత్తుతుంది. అలాంటి సంఘటనే ఇప్పుడు…

భారతదేశంలో చట్టం అందరికీ ఒకటే అయినా వివాహాలు, విడాకులు, వారసత్వాల విషయంలో.. ముస్లిం లా, క్రిస్టియన్ లా వేర్వేరుగా ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు సాధారణ చట్టాలతో వీటికి ఘర్షణ తలెత్తుతుంది. అలాంటి సంఘటనే ఇప్పుడు మళ్లీ ఎదురైంది.

15 ఏళ్ల వయసు వస్తే ముస్లిం యువతి వివాహానికి అర్హురాలు అని ముస్లిం పర్సనల్ లా చెబుతోంది. అయితే బాల్య వివాహాల నిషేధ చట్టం 2006లోని సెక్షన్ 12 ప్రకారం 18 ఏళ్లు నిండకుండా జరిగే వివాహాలు చెల్లుబాటు కావు. ఈ రెండూ పరస్పర విరుద్ధమైనవే. అయితే దీనిపై ఇప్పుడు సుప్రీంకోర్టు దృష్టి సారించింది. 15 ఏళ్లు వచ్చాక ముస్లిం యువతి తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకోవచ్చని పంజాబ్, హర్యానా హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలపై రిట్ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుని మరే ఇతర కేసులోనూ ఉదాహరణగా తీసుకోవద్దని స్పష్టం చేసింది.

పంజాబ్, హర్యానా కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి..?

పంచకులలోని చిల్డ్రన్స్ హోమ్‌ లో తన 16 ఏళ్ల భార్యను నిర్బంధించారని, 26 ఏళ్ల యువకుడు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ పై విచారణ సందర్భంగా పంజాబ్, హర్యానా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 15 ఏళ్లు నిండిన ముస్లిం యువతి తన ఇష్ట ప్రకారమే ఓ యువకుడిని వివాహం చేసుకుంది. అయితే అది బాల్యవివాహం అంటూ అధికారులు అడ్డుకున్నారు. వివాహం జరిగినా కూడా ఆ అమ్మాయిని పంచకులలోని చిల్డ్రన్స్ హోమ్ కి తరలించారు.

దీంతో ఆ యువకుడు హైకోర్టుని ఆశ్రయించాడు. ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం తమకు వివాహ వయసు ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోరాడు. పంజాబ్, హర్యానా హైకోర్టు వారికి రక్షణ కల్పించింది. అయితే దీనిపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేసింది.

విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు..

ఈ వ్యవహారంలో హర్యానా ప్రభుత్వంతో పాటు పలువురికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రిట్ పిటిషన్లను పరిశీలించేందుకు అంగీకరిస్తున్నామని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కోర్టుకు సహాయం చేయడానికి ఈ కేసులో సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావును అమికస్ క్యూరీగా నియమించింది. విచారణ సందర్భంలో.. 14, 15, 16 ఏళ్ల ముస్లిం యువతులకు పెళ్లిళ్లు జరుగుతున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ముస్లిం పర్సనల్ లా విషయంలో సుప్రీంకోర్టు ఇవ్వబోయే తుది తీర్పు ఆసక్తికరంగా మారింది.