కొహ్లీ కెప్టెన్సీ ఉంటుందా? ఊడుతుందా? కొన్నాళ్లు మిస్ట‌రీ!

టీమిండియా టీ20 కెప్టెన్ గా కొహ్లీ శకం ముగిసింది. త‌నే చెప్పిన ప్ర‌కారం.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ తో కొహ్లీ ఆ ప‌రిమిత ఓవ‌ర్ల ఫార్మాట్ కెప్టెన్ హోదా నుంచి త‌ప్పుకున్నాడు. అయితే త‌న అనంత‌రం…

టీమిండియా టీ20 కెప్టెన్ గా కొహ్లీ శకం ముగిసింది. త‌నే చెప్పిన ప్ర‌కారం.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ తో కొహ్లీ ఆ ప‌రిమిత ఓవ‌ర్ల ఫార్మాట్ కెప్టెన్ హోదా నుంచి త‌ప్పుకున్నాడు. అయితే త‌న అనంత‌రం కెప్టెన్ గా యువ ఆట‌గాడిని ఎంపిక చేయాలంటూ కొహ్లీ సూచించాడ‌ట‌. 

త‌ను కెప్టెన్ గా ఉన్న‌ప్పుడే రోహిత్ శ‌ర్మ‌ను వైస్ కెప్టెన్సీ నుంచి కూడా త‌ప్పించాల‌ని, యంగ్ ప్లేయ‌ర్ ను ఆ స్థానంలోకి తీసుకురావాల‌ని కొహ్లీ సూచించిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే సెలెక్ట‌ర్లు, బోర్డు అలా చేయ‌లేదు, చేయ‌డం లేదు.

న్యూజిలాండ్ తో స్వ‌దేశంలో జ‌రిగే టీ20 సీరిస్ కు రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్ గా ఎంపిక చేయ‌డం లాంఛ‌న‌మే అని తెలుస్తోంది. రోహిత్ కెప్టెన్సీలోనే ఈ సీరిస్ ను ఇండియా ఆడ‌నుంది. రోహిత్ కు డిప్యూటీగా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేయ‌నున్నార‌ని స‌మాచారం. త‌న అనంత‌రం యంగ్ ప్లేయ‌ర్ ఒకరు కెప్టెన్సీ తీసుకోవాల‌న్న కొహ్లీ లెక్కను బీసీసీఐ ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఇక టీ20 కెప్టెన్సీ నుంచి కొహ్లీ త‌నే త‌ప్పుకున్నాడు. దాని ప్ర‌కారం.. వ‌న్డే, టెస్టుల‌కు త‌నే కెప్టెన్ గా కొన‌సాగాల‌నేది కొహ్లీ అభిమతం అని స్ప‌ష్టం అవుతోంది. కానీ.. బీసీసీఐ అందుకు పూర్తి స‌మ్మ‌తితో ఉందా? అనేది ప్ర‌స్తుతానికి మిస్ట‌రీనే. న్యూజిలాండ్ తో స్వ‌దేశంలో ఇండియా జ‌ట్టు కేవ‌లం టీ20లు, టెస్టు మ్యాచ్ ల‌ను మాత్ర‌మే ఆడుతుంది. ఈ సీరిస్ ల‌లో వ‌న్డేలు లేవు. దీంతో వ‌న్డే కెప్టెన్ ఎవ‌రు? అనే చ‌ర్చ కొన్నాళ్లు ఉండ‌దు.

అలాగే కివీస్ తో తొలి టెస్టు మ్యాచ్ లో కూడా కొహ్లీ ఉండ‌డ‌ని స‌మాచారం. టీ20 సీరిస్, తొలి టెస్ట్ మ్యాచ్ ల‌కు కొహ్లీకి రెస్టు ఖాయంగా తెలుస్తోంది. తొలి టెస్టుకు కూడా రోహిత్ శ‌ర్మ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని, అజింక్య ర‌హ‌నే వైస్ కెప్టెన్  గా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్టుగా తెలుస్తోంది. రోహిత్ శ‌ర్మ‌కు టీ20 ల కెప్టెన్సీ ఖ‌రారే. 

ఇక వ‌న్డేల కెప్టెన్సీ కొహ్లీకే ద‌క్కుతుందా లేదా.. అనే అంశం భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా ప‌ర్యట‌న వ‌ర‌కూ క్లారిటీకి రాక‌పోవ‌చ్చు. కొహ్లీని కేవ‌లం టెస్టు కెప్టెన్సీకి ప‌రిమితం చేస్తార‌నే వాద‌న ఉంది. మూడు ఫార్మాట్ల‌కూ కొహ్లీని కెప్టెన్ గా త‌ప్పించినా ఫ‌ర్వాలేదు, ఆట‌గాడిగా అత‌డికి అది మంచే చేస్తుంద‌నే వాద‌నా లేక‌పోలేదు!