విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ఎయిడెడ్ సెగ తగిలింది. అనంతపురంలో ఎస్ఎస్‌బీఎన్ ఎయిడెడ్ కాలేజీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడాన్ని నిరసిస్తూనిన్న అక్కడ పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా డిగ్రీ విద్యార్థిని జయలక్ష్మి తలకు రాయి తగిలి గాయమైంది. విద్యార్థి సంఘాల నేతలపై పోలీసులు లాఠీచార్జీకి పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలో ఎయిడెడ్ విధానంపై వివరణ ఇచ్చేందుకు విజయవాడ ఆర్అండ్‌బీ భవనంలో మంత్రి సురేష్ నాలుగు గంటలకు ప్రెస్‌మీట్ ఉంటుందని ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న వివిధ విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి వెళ్లారు. మంత్రి ప్రెస్‌మీట్ స్టార్ట్ చేయగానే విద్యార్థులు దూసుకెళ్లారు. మంత్రిని విద్యార్థి సంఘాల నాయకులు చుట్టుముట్టారు.
విద్యార్థి సంఘాల నేతలపై లాఠీచార్జీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులపై లాఠీచార్జీకి పాల్పడ్డ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించారు. ఎయిడెడ్ కాలేజీలను విలీనం చేసుకునే నిర్ణయాన్ని విరమించుకుని, విద్యా వ్యవస్థను కాపాడాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు నచ్చ చెప్పేందుకు మంత్రి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికి అక్కడి నుంచి మంత్రి వెనుదిరగాల్సి వచ్చింది. అనుకోకుండా జరిగిన ఘటనతో విద్యామంత్రి షాక్ తినాల్సి వచ్చింది.