పూజా హెగ్డే కాస్తా ఇప్పుడు బిజీ హెగ్డే అయిపోయింది. తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది. మరి ఇలాంటి టైమ్ లో ఆమె ఐటెంసాంగ్ చేస్తుందా? రంగస్థలం సినిమాలో చేసిన జిగేల్ రాణి లాంటి పాటలు చేస్తుందా?
“స్పెషల్ సాంగ్స్ చేయకూడదని లేదు. అలా అని ప్రత్యేకంగా నేను ప్లాన్ చేయను. నా మనసుకు నచ్చినవి చేసుకుంటూ వెళ్లాను. ఓ మంచి సాంగ్ ఉందంటే కచ్చితంగా చేస్తాను. స్పెషల్ సాంగ్స్ ఉంటే తీసుకురండి. నాకు నచ్చితే కచ్చితంగా చేస్తాను. ఎలాంటి అభ్యంతరం లేదు.”
ఇలా ప్రత్యేక గీతాలపై తన మనసులో మాటను బయటపెట్టింది పూజాహెగ్డే. హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. ప్రత్యేక గీతాలు, ప్రత్యేక పాత్రలు తనకు నచ్చితే చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటోంది. ఆచార్యలో కూడా తను చేసింది ప్రత్యేక పాత్ర మాత్రమేనని, కేవలం క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నానని అంటోంది.
“ఆచార్య స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. పైగా అందులో నీలాంబరి పాత్ర ఇంకా నచ్చింది. అది ప్రత్యేక పాత్ర అయినప్పటికీ చేశాను. ఎందుకంటే అది మంచి పాత్ర. విలేజ్ బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. దీంతో పాటు అది పెద్ద ప్రాజెక్టు. అలాంటి సినిమాలు మిస్ చేసుకోకూడదు.”
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. పాత్రల ఎంపికలో క్యారెక్టరైజేషన్ తో పాటు, స్టార్ కాస్ట్, బ్యానర్, డైరక్టర్ లాంటి అంశాలన్నింటినీ లెక్కలోకి తీసుకుంటానని.. పాత్ర చిన్నదైనా స్టార్ హీరో, పెద్ద డైరక్టర్ అయితే చేస్తానని అంటోంది.