హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆర్కెస్ట్రా కంపెనీలో ఆమె డ్యాన్సర్. పేరు షరీఫ్ ఫాతిమా. వయసు 30 ఏళ్లు. ఇటీవలే చిన్న చిన్న సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఆదాయం కూడా బాగానే ఉంది. అంతలోనే విధి చిన్న చూపు చూసింది. ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు.
ఇద్దరు పిల్లలు, తల్లితో ఆమె ఫలక్ నుమా దగ్గర్లో ఉన్న ముస్తఫా నగర్ లో నివాసం ఉండేది. ఈమధ్యే దగ్గర్లో కొత్త అపార్ట్ మెంట్ కొనుగోలు చేసింది. ఇంటీరియర్ పనులు దగ్గరుండి చేయిస్తోంది. ఈ క్రమంలో కొత్త ఇంటి వద్దకు ఆమె ఒక్కతే వచ్చింది. పిల్లల్ని తల్లి వద్ద వదిలి పెట్టి కొత్త ఇంటికి వెళ్లిన ఫాతిమా మళ్లీ రాలేదు.
శవంగా మారింది..
కొత్త ఇంటికి వెళ్లిన కూతురు ఫాతిమా ఎంతసేపటికి తిరిగి రాకపోయే సరికి తల్లికి అనుమానం వచ్చి ఫోన్ చేసింది. ఫోన్ స్విచాఫ్ చేసి ఉండటంతో నేరుగా కొత్త ఇంటికి వెదుక్కుంటూ వచ్చింది తల్లి. డోర్ తీసి చూడగా.. నట్టింట్లో అర్థ నగ్నంగా పడి ఉంది ఫాతిమా. ప్రాణం లేదు. రక్తపు మడుగులో పడి ఉన్న కూతుర్ని చూసి షాకయింది తల్లి. పోలీసులకు సమాచారమిచ్చింది.
కొత్త ఇల్లు, అర్థనగ్నంగా ఫాతిమా, పక్కన బీరు సీసాలు.. పోలీసులు వచ్చేసరికి ఇదీ సీన్. అసలేం జరిగింది అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫాతిమా ఫోన్ కనపడకపోయేసరికి ఎవరో పథకం ప్రకారం ఆమెను హత్య చేసినట్టు గుర్తించారు. వాళ్లు ఆమెకు తెలిసినవారేనని నిర్థారణకు వచ్చారు పోలీసులు. అందరూ కలసి బీరు పార్టీ చేసుకున్నారా..? లేక ఫాతిమాను చంపి ఎవరైనా అక్కడ బీరు తాగి పారిపోయారా అని ఆరా తీస్తున్నారు.
దగ్గర్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని తెప్పించి కేసు విచారణ చేపట్టారు పోలీసులు. అప్ కమింగ్ డ్యాన్సర్ అకస్మాత్తుగా ఇలా హత్యకు గురికావడంతో ఒక్కసారిగా ఫలక్ నుమా ప్రాంతం ఉలిక్కిపడింది.