అదే జరిగితే జనసేన-బీజేపీ బ్రేకప్ నిజం!

రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు ఒక పార్టీ నుంచి, పొత్తు పెట్టుకున్న రెండో పార్టీలోకి జంపింగ్ లు ఉండవు. అలాంటి జంపింగ్ లకు రెండు పార్టీలు కూడా సహకరించకూడదు.  Advertisement అదే పొత్తు ధర్మం.…

రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు ఒక పార్టీ నుంచి, పొత్తు పెట్టుకున్న రెండో పార్టీలోకి జంపింగ్ లు ఉండవు. అలాంటి జంపింగ్ లకు రెండు పార్టీలు కూడా సహకరించకూడదు. 

అదే పొత్తు ధర్మం. ఒకవేళ పొత్తులో ఉన్న రెండు పార్టీల మధ్యే గోడ దూకుళ్లు ఉంటే ఇక ఆ సయోధ్యకు అర్థమే ఉండదు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు వ్యవహారం ఈ గోడదూకుళ్లతో చెడిపోయేలా ఉంది.

కామినేనికి మంట పెట్టింది ఎవరు..?

మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ కి ఆ పార్టీ ముందు నుంచీ మంచి గౌరవం ఇచ్చింది. చంద్రబాబు బ్యాచ్ అని తెలిసినా కూడా 2014లో ఏపీ కేబినెట్ లో బీజేపీ తరపున ఆయనకు బెర్త్ లభించింది. కట్ చేస్తే, ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కామినేని కొత్త ఎత్తుగడ వేశారు. బీజేపీ నుంచి జనసేన వైపు వచ్చేందుకు ఆయన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

వాస్తవానికి రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి కాబట్టి, అటునుంచి ఇటు.. ఇటు నుంచి అటు.. జంపింగ్ లకు ఎవరూ సహకరించకూడదు. కానీ కామినేని లాంటి నేత, మాజీ మంత్రి వస్తానంటున్నారు కాబట్టి పవన్ కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇందులో చంద్రబాబు దూరాలోచన కూడా ఉందనే విషయం అందరికీ తెలుసు. కామినేని జంపింగ్ ఖరారు అయితే జనసేన-బీజేపీ పొత్తు చిత్తయినట్టే.

పార్టీ నుంచి బయటికొస్తే కచ్చితంగా ఎందుకొచ్చారో చెప్పాలి, ఏం తప్పు జరిగిందో, ఏం తక్కువ చేశారో వివరించాలి. మరి బీజేపీ నుంచి జనసేనలోకి వచ్చే సందర్భంలో కామినేని కమలదళాన్ని ఎలా తప్పుబడతారు. అంతా బాగానే ఉంది అని చెబితే.. ఇక పార్టీ మారడం ఎందుకు..? స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మారారంటూ ఆయనపై నిందలు వేస్తారు కదా..? బీజేపీని బలహీనపరిచే కుట్ర జరుగుతోందని పవన్ పై కూడా నింద పడుతుంది కదా..?

ఈ రెండిటినీ తప్పించుకోవాలంటే కామినేని బీజేపీని టార్గెట్ చేయాలి. తాను ఎందుకు బయటికి వచ్చారో చెప్పాలి. ఏపీ బీజేపీ నేతల్ని ఏకిపారేయాలి. అదే జరిగితే.. జనసేనతో బీజేపీకి ఉన్న ఆ కాస్త బంధం కూడా తెగిపోతుంది. టీడీపీ-జనసేన బంధానికి మొగ్గ తొడుగుతుంది.

ఇప్పటికే బీటలు..

బీజేపీ-జనసేన పొత్తుల వ్యవహారానికి ఇప్పటికే చాలాచోట్ల బీటలు పడ్డాయి. ఎవరి రాజకీయం వారిది, ఎవరి నిరసనలు వారివి. ఇద్దరూ కలసి చేసిన కార్యక్రమాలు అరుదు, కలసి చేసిన పోరాటాలు శూన్యం. కానీ ఎన్నికలొచ్చే సరికి ఉమ్మడిగా ఒకేమాటపై ఉంటారు. 

తిరుపతిలో అదే జరిగింది, కానీ బద్వేల్ ఉప ఎన్నికకు వచ్చేసరికి ఆ సయోధ్య కూడా పోయింది. జనసేన పోటీ వద్దంది, బీజేపీ బరిలో దిగి పరువు పూర్తిగా పోగొట్టుకుంది. ఇక మిగిలిపోయిన స్థానాలకు జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ఎవరిదారి వారిదే అన్నట్టుంది వ్యవహారం.