పెళ్లి పేరుతో ఒకరు కాదు ఇద్దరు కాదు…ఏకంగా 19 మంది మహిళలను ఓ ప్రబుద్ధుడు మోసగించాడు. పెళ్లి చేసుకుంటాడని నమ్మే వాళ్లుంటే ఎంత మందినిదగా చేయడానికైనా తాను రెడీ అన్నట్టుంది ఆ వంచకుడి వైఖరి. పెళ్లి పేరుతో మహిళలు మోసపోవడం, దుష్టులు మోసగించడం సర్వసాధారణమైంది.
పెళ్లి చేసుకుంటానని నమ్మి మోసపోయిన మహిళ గురించి తాజాగా తెలిసొచ్చింది. అది కూడా మోసగాడి పెద్ద భార్య ఫిర్యాదుతో బయటికి రావడం విశేషం. నల్గొండలో ఓ చర్చిలో విలియమ్స్ పియానో వాయిస్తాడు. అతనికి ఆల్రెడీ పెళ్లైంది. అయితే తన పాడుబుద్ధి పోనిచ్చుకోలేదు. చర్చికి వచ్చే యువతులకు ప్రేమ, పెళ్లి పేరుతో వల విసిరాడు.
ఇలా అతని కామవాంఛలకు పెద్ద సంఖ్యలో మహిళలు బలి అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య పోలీసులను ఆశ్రయించి తన భర్త వంచనపై ఫిర్యాదు చేసింది.
తన భర్త కామవాంఛలకు 19 మంది యువతులు, మహిళలు బలి అయ్యారని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు గుండెపోటు వచ్చిందంటూ అతను పోలీసులకు చెప్పి ఆస్పత్రి పాలు కావడం గమనార్హం.