పవన్‌…నీకు సిగ్గులేదా?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మంత్రి కొడాలి నాని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ప‌నిలో ప‌నిగా బీజేపీ, టీడీపీల‌పై త‌న‌దైన స్టైల్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి, దేశానికి ద్రోహం చేస్తున్న బీజేపీతో అంట‌కాగుతున్న…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మంత్రి కొడాలి నాని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ప‌నిలో ప‌నిగా బీజేపీ, టీడీపీల‌పై త‌న‌దైన స్టైల్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి, దేశానికి ద్రోహం చేస్తున్న బీజేపీతో అంట‌కాగుతున్న జ‌న‌సేన‌ను తూర్పార ప‌ట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అఖిల‌ప‌క్షం ఏర్పాటు చేయాల‌ని, ఇందుకోసం వారం రోజుల డెడ్‌లైన్ విధించిన ప‌వ‌న్‌ను ఒక ఆట ఆడుకున్నారు.

బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీకి 90వేలకు పైగా మెజార్టీ వచ్చిందని బీజేపీకి ప్రజలు గడ్డి పెట్టారని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. బీజేపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆయ‌న హెచ్చ‌రించారు. బీజేపీపై పెట్రోల్‌.. టీడీపీపై డీజిల్‌ పోసి జనం తగులబెట్టారని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ నేతృత్వం వ‌హిస్తున్న జనసేన ఓ పలికిమాలిన పార్టీగా కొడాలి నాని అభివ‌ర్ణించారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు పవన్‌ కల్యాణ్‌కు సిగ్గు లేదా? అని తీవ్ర‌స్థాయిలో నిల‌దీశారు. జగన్‌ మేక, నక్క కాదని, పులివెందుల పులి అని నాని గ‌ర్జించారు. గల్లీలో ఉన్న సిల్లీ బీజేపీ నాయకులు ఆయన్ను ఏమీ చేయలేరని స్ప‌ష్టం చేశారు.  

ప్రజా సమస్యల పేరుతో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలట, వీళ్లకి అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలట అని నాని వ్యంగ్యంగా అన్నారు. వారంలో అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని జగన్‌కు వార్నింగ్‌ ఇస్తున్నారని ప‌వ‌న్ డెడ్‌లైన్ వార్నింగ్‌ను ఆయ‌న గుర్తు చేశారు. 

మోదీ, అమిత్‌షా అపాయింట్‌మెంట్  జగన్ ఇప్పిస్తే…. అఖిలపక్షంలో చంద్రబాబు, పవన్‌ దూరి ఢిల్లీ వస్తామంటున్నార‌ని చెప్పారు. వ్యక్తిగతంగా మాట్లాడాలని కాళ్లు పట్టుకుంటారని ఆరోపించారు.

ఆ మూడు పార్టీలూ కలిసి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మీ రాజకీయ అవసరాల కోసం కేంద్రం వద్దకు తీసుకెళ్లే ప్రసక్తే లేదని కొడాలి నాని తేల్చి చెప్పారు. విశాఖ ఉక్కుకు మ‌ద్ద‌తుగా ప‌వ‌న్ మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్‌ను టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. 

విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యం చేసిన మోదీ స‌ర్కార్‌ను మాత్రం మాట మాత్రం కూడా విమ‌ర్శించ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కేవ‌లం త‌మ‌ను టార్గెట్ చేసేందుకే విశాఖ‌కు ప‌వ‌న్ వెళ్లార‌ని వైసీపీ ఆగ్ర‌హంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌పై కొడాలి నాని వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.