ఏపీ రాజకీయంలో టీడీపీ పాత్ర క్రమంగా తగ్గుతున్నట్టుగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఏదైనా రాజకీయ పార్టీ ప్రధానంగా పోరాడాల్సిన ఎన్నికల సంగ్రామంలోనే టీడీపీ పేరు క్రమంగా వినపడకుండా పోతోంది.
స్థానిక ఎన్నికలకు మొదట్లో ఉత్సాహం చూపిన టీడీపీ.. చివరకు ఆ ఎన్నికల ప్రక్రియను నామినేషన్ల అనంతరం బహిష్కరించే వరకూ వచ్చింది! ఎన్ని సాకులు చెప్పినా.. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అనేది మామూలు డ్యామేజీ కాదు. ఇక బద్వేల్ ఉప ఎన్నిక పోటీ నుంచి కూడా టీడీపీ తప్పుకోవడం గురించి ఎన్ని కథలు అల్లినా, ఓటమికి భయపడే తప్పుకున్నారనే అభిప్రాయాలు గట్టిగా ఉన్నాయి.
ఇక మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో అయితే టీడీపీకి అవకాశమే దక్కేలా లేదు. ఒకవైపు ఏపీ శాసనసభ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. ఇంకోవైపు ఏపీలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ వచ్చింది. ఈ రెండింటిలో కూడా టీడీపీకి అవకాశం లేకపోవడం గమనార్హం. శాసనసభ కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థులను నిలబెట్టుకోలేదు. అంత బలం లేదు. ఇక స్థానిక సంస్థల కోటాలో పలు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది.
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల విషయంలో టీడీపీ బలమెంతో చెప్పనక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో ఈ స్థానిక ఎన్నికల్లో ఎక్కడా టీడీపీ తరఫున నామినేషన్లు వేయాల్సిన అవసరం కూడా లేనట్టే. మొత్తం సీట్లను దాదాపు ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంటుంది. ఒకవేళ టీడీపీ ఎక్కడైనా నామినేషన్లు వేసినా.. ఆ పార్టీకి స్థానిక సంస్థల్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల.. చిత్తయిపోవడం జరగవచ్చు.
గతంలో ఇలానే స్థానిక సంస్థల సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే.. బలప్రయోగంతో టీడీపీ వాటిని సొంతం చేసుకుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప, అలాగే కర్నూలు వంటి జిల్లాల్లో స్థానిక సంస్థల సభ్యులను సంఖ్యను బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన సీట్లను టీడీపీ తను సొంతం చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల సభ్యుల ఓట్లను తన వైపుకు తిప్పుకుంది. అంగ, అర్థ బలాలతో టీడీపీ ఆ సీట్లను నెగ్గింది.
ఇప్పుడు ఆ పార్టీకి కనీసం పోటీ చేసే అవకాశం కూడా లేకపోవడం గమనార్హం. ప్రజాస్వామ్యం, విలువలు అంటూ చంద్రబాబు నాయుడు ఇప్పుడు నిత్యం వాపోతున్నారు. మరి.. తమ హయాంలో వర్ధిల్లిన ప్రజాస్వామ్యం ఇలాంటి సందర్భాల్లో అయినా తెలుగుదేశం అధినేతకు గుర్తు రాదా?