బాలీవుడ్ హీరో సుశాంత్ మరణానికి సంబంధించి అతడి ప్రియురాలు రియాను వరుసగా రెండో రోజు ప్రశ్నించింది సీబీఐ. మొదటి రోజు (శుక్రవారం) ఏకంగా 10 గంటల పాటు రియాపై ప్రశ్నల వర్షం కురిపించిన సీబీఐ అధికారులు.. రెండో రోజు 7 గంటల పాటు రియాను విచారించారు. శుక్రవారం చీకటి పడిన తర్వాత శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్ కు రియా వెళ్లడంతో లేట్ అవ్వడం వల్ల.. ఈరోజు విచారణకు మధ్యాహ్నం నుంచి ఆమె హాజరైంది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ముంబయిలోని డీఆర్డీవో గెస్ట్ హౌజ్ కు రియా, అతడి సోదరుడు షోవిక్ చేరుకోగా.. వెంటనే సీబీఐ తన ఎంక్వయిరీ స్టార్ట్ చేసింది.
రెండో రోజు విచారణలో భాగంగా ఈరోజు పూర్తిగా డ్రగ్స్ కు సంబంధించి రియాను ప్రశ్నించింది సీబీఐ. ఈడీ ఇచ్చిన సమాచారంతో పాటు సుశాంత్ చెల్లెలు ఇచ్చిన సమాచారంతో ప్రశ్నల్ని తయారుచేసి రియాకు అందించారు. పలు జాతీయ మీడియా ఛానెళ్లు చెబుతున్న సమాచారం ప్రకారం.. మీడియాలో చక్కర్లు కొడుతున్న వాట్సాప్ స్క్రీన్ షాట్స్ తనవేనని రియా ఒప్పుకుందట. అందులో ఆమె ఎమ్ఎల్, ఎండీ లాంటి పరోక్ష పదజాలాన్ని వాడింది.
ఆల్రెడీ చక్కర్లు కొట్టిన వాట్సాప్ స్క్రీన్ షాట్స్ కాకుండా.. నిన్న రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ మరికొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్స్ ను తన సోషల్ మీడియా వాల్ లో పోస్ట్ చేశారు. ఆ ఛాటింగ్స్ లో రియా సోదరుడు షోవిక్, శామ్యూల్ మిరందా, సిద్దార్థ్ పితానీ డూబీ గురించి మాట్లాడినట్టు ఉంది. డ్రగ్స్ పరిభాషలో డూబీ అంటే మాదక ద్రవ్యాలతో నింపిన సిగరెట్ అని అర్థం. దీంతో పాటు “బ్లూబెర్రీ ఖుష్” అనే పదాన్ని కూడా వాళ్లు వాడారు. ఇది కూడా ఓ మాదకద్రవ్యానికి ముద్దుపేరు.
తాజాగా బయటకొచ్చిన స్క్రీన్ షాట్స్ కు సంబంధించి కూడా రియాను సీబీఐ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా గౌరవ్ ఆర్య ఎవరు, అతడితో సంబంధం ఏంటి లాంటి ప్రశ్నల్ని సీబీఐ ఎక్కువగా సంధించినట్టు తెలుస్తోంది. హోటల్స్ బిజినెస్ చేసే గౌరవ్ ఆర్యకు మాదకద్రవ్యాల చెయిన్ తో సంబంధం ఉందనే ప్రచారం చాన్నాళ్లుగా బాలీవుడ్ లో ఉంది. ఇప్పుడు అతడికి కూడా సమన్లు జారీచేసింది ఈడీ. సోమవారం గౌరవ్, ఈడీ విచారణకు హాజరుకాబోతున్నాడు.
మరోవైపు రియా కోరుకున్నట్టు ముంబయి పోలీసులు ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు భద్రత కల్పించారు. సీబీఐ ఆదేశించిన తర్వాత ముంబయి పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే విచారణ నిమిత్తం రియా, ఆమె కుటుంబ సభ్యులు బయటకొచ్చినప్పుడు మాత్రమే ముంబయి పోలీసులు రక్షణ కల్పిస్తారు. రేపు ఆదివారం అయినప్పటికీ సీబీఐ అధికారులు రియాను మరోసారి విచారించే అవకాశం ఉంది.