ఎన్నో సంవత్సరాల పాటు ఒక రంగంలో ఎరిగిన వ్యక్తుల ఇమేజ్ ను కూడా సోషల్ మీడియా రాత్రికి రాత్రి మార్చేస్తూ ఉంది! ఒక సంఘటన జరిగిన వెంటనే ఆయా వ్యక్తులు తమ అభిప్రాయాలను నిజాలు అన్నట్టుగా సమాజం మీద రుద్దుతూ ఉన్నారు! బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై ఇదే కొనసాగుతూ ఉంది. సుశాంత్ ది ఆత్మహత్యా, హత్యా.. అనేది ఇంకా అధికారికంగా తేలలేదు.
ముంబై పోలీసులు మాత్రం ఆత్మహత్యగా నిర్ధారణ చేశారు. సుశాంత్ ఎలాంటి లేఖ రాయలేని వారు పేర్కొన్నారు. సీబీఐ అందుకు సంబంధించిన విచారణ కొనసాగిస్తూ ఉంది. సీబీఐ విచారణ చేయడం సబబే. ఇందులో నిజాలు ఏమిటో మరోసారి నిగ్గుదేలాలి. సుశాంత్ ది హత్యే అయితే.. దోషులకు శిక్ష పడాలి. ఆత్మహత్య అయితే.. సుశాంత్ మరణాన్ని గౌరవించాలి. ఒకవేళ అతడు ఏదైనా మానసిక ఇబ్బందితో ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. లేక కొంతమంది అతడు ఆత్మహత్య చేసుకునేందుకు పరిస్థితులను కల్పించారా? అనేది కీలకమైన అంశం.
ఒకవేళ ఏ బాలీవుడ్ వ్యక్తులో సుశాంత్ ను ఆత్మహత్య చేసుకునేందుకు కారణం అయి ఉంటే.. ఆ నటుడే ఆ విషయాన్ని లేఖగా రాసి వెళ్లేవాడు కదా? అనేది కూడా ఆలోచించాల్సిన అంశమే. తను మోసపోయి ఉంటే ఆ విషయాన్ని సుశాంత్ ప్రస్తావించేవారేమో! ఒకవేళ అతడిది హత్యే అయితే.. సీబీఐ కూడా వీలైనంతగా దోషులను పట్టుకోవాలి.
అయితే ఇంతలోపు.. అనేక మంది క్యారెక్టర్ ను అసాసిన్ చేయడానికి సోషల్ మీడియా మాత్రం వెనుకాడటం లేదు! సుశాంత్ మరణ వార్త వచ్చినప్పటి నుంచి అనేక మందిపై నెగిటివ్ వార్తలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. కరణ్ జొహార్, ఇతర బాలీవుడ్ ప్రముఖులు.. వారసులు వీళ్లంతా సుశాంత్ మరణం తర్వాత అనేక రకాలుగా టార్గెట్ అయ్యారు. హీరోయిన్లుగా వచ్చిన హీరోల కూతుళ్లను కూడా ఈ వ్యవహారంలో టార్గెట్ చేశారు. వాళ్ల కష్టమేదో వారు పడుతున్నారు. ఇండస్ట్రీలో వారికి కొంత అనుకూల పరిస్థితులు ఉండవచ్చు. అంత మాత్రానా.. వాళ్లంతా సుశాంత్ ఆత్మహత్యకు కారణం అవుతారా?
ఇక ఈ కేసులో చాలా మందిని చాలా మంది తిడుతున్నారు! దేనికో అర్థం కాదు. విచారణ చేసే వాళ్లు విచారణ చేస్తున్నారు. వాళ్లు ఏదో ఒకటి తేల్చే వరకూ ఈ బ్లేమ్ గేమ్ ఆగితే మంచిది. ఎవరో ఒకరు దోషిగా తేలితే వారికి తీరిగ్గా నిందించవచ్చు! అయితే అంత వరకూ ఓపిక పట్టే ఉద్దేశం ఎవరికీ లేనట్టుగా ఉంది. ఇన్నాళ్లూ మీడియా సంచలనాల కోసం పని చేస్తుందంటూ అనేక విమర్శించే వారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాకు కూడా కావాల్సింది కేవలం సంచలనాలే అనే అభిప్రాయాలు కలిగితే తప్పెవరిది?