ఆంగ్ల మీడియా పోకడలు ఒక్కోసారి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఎంతో మంది మేధావులు పని చేస్తారు అనే ఇమేజ్ కలిగిన ఇంగ్లిష్ మీడియా ఆశ్చర్యానికి గురి చేసేలా ప్రవర్తిస్తూ ఉంది. ప్రత్యేకించి గత కొన్నాళ్లుగా నటి రియా చక్రబర్తి విషయంలో మీడియా చూపుతున్న ఆసక్తి, నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై గురించి వండి వార్చుతున్న కథనాలు సగటు పాఠకుడిని విసిగెత్తిస్తున్నాయి కూడా!
సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య అని మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన కుటుంబీకులు తమ అనుమానాలను వ్యక్తం చేశారు. ఫిర్యాదులు చేశారు, విచారణ సాగుతూ ఉంది. దాంట్లో ఏం తప్పు పట్టడానికి లేదు. అయితే మీడియా అత్యుత్సాహాన్ని చూస్తే విస్తుపోవాల్సి వస్తోంది. ఒకవైపు దేశంలో కోవిడ్-19 విపత్తు కొనసాగుతూ ఉంది. గమనిస్తున్నారో లేదో రోజుకు వెయ్యి మంది ఈ మహమ్మారి బారిన పడి మరణిస్తూ ఉన్నారు. వారందరివీ సహజమరణాల కింద భావించడానికి లేదు. కోవిడ్-19 వల్ల ఎంతో మంది ఆరోగ్యవంతులు కూడా మరణించిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకూ కోవిడ్-19 వల్ల సంభవించిన మరణాలు 60 వేలకు పైనే ఉన్నాయి.
అది చిన్న విషయం కాదు. అమెరికాలో కోవిడ్ మరణాలు తీవ్ర స్థాయికి చేరిన సమయంలో అక్కడి మీడియా ఆ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి పేర్లను పతాక శీర్షికల్లో ముద్రించి మానవత్వాన్ని చాటుకుంది. మానవాళి ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోమంటూ కరోనా బారిన పడి మరణించిన వారి పేర్లను ఇచ్చింది. మరోవైపు కరోనాతో ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా పోరాడుతూ ఉన్నారు. డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు.. వీళ్లలో ఎంతో మంది కరోనాకు గురి అవుతున్నారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు.
ఇంకోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ సాగుతూ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా భయాన్ని అడ్డుపెట్టుకుని ఆసుపత్రులు నిలువు దోపిడీ చేస్తున్నాయి. కాస్త సీరియస్ అయిన కేసులను అడ్డం పెట్టుకుని రోజుకు నలభై వేల రూపాయల వరకూ కూడా చార్జ్ చేస్తున్నాయి కొన్ని ఆసుపత్రులు. తరచి చూస్తే.. ఇవే వార్తాంశాలు. వీటి గురించి మీడియా పోరాడాలి. కరోనా వేళ ప్రజలకు అండగా నిలబడాలి. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ కథలను వివరించి వాటికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించాలి. అది కదా జర్నలిజం అంటే!
అయితే ఎంతసేపూ రియా చక్రబర్తి, ఆమె వాట్సాప్ లో ఎవరితో చాట్ చేసింది? ఏం మాట్లాడింది? ఏం డ్రగ్స్ వాడింది? సుశాంత్ వంట మనిషి ఏం చెప్పాడు? సుశాంత్ పక్కింటి వాళ్ల పనిమినిషి ఏం చెప్పింది? ఇవా వార్తాలు? వాటిల్లో అయినా ఏదైనా వాస్తవ ఉంటుందా? వారందరి వెర్షన్లూ నిజంగానే అవసరం అయితే.. దానికి సీబీఐ ఉంది. దాని పని అది చేస్తోంది కదా. మధ్యలో మీడియా మరీ లేకిగా వ్యవహరిస్తూ ఉంది. రియా చక్రబర్తికి కూడా ఎలాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టే హిందీ మీడియా, ఉత్తరాది మీడియా ఆమెను కూడా ఈజీగా బజారుకు ఈడ్చగలుగుతున్నాయి. అదే ఆమె ఏ స్టార్ హీరో కూతురో, మరో సినిమా బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటే.. ఆమె వాట్సాప్ చాట్ లను మీడియా ధైర్యంగా రచ్చకెక్కించగలిగేదా అనేది కూడా పాయింటే!
ఉత్తరాది మీడియాది నిజంగానే సుశాంత్ పై సానుభూతి కూడా కాదని, ఒక రాజకీయ అజెండాతోనే ఈ అంశంలో ప్రతి దాన్నీ సంచలనంగా మారుస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బిహార్ ఎన్నికలు అయిపోగానే.. సుశాంత్ మరణం అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం ముగుస్తుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.
హిమ