ఒకవైపు కరోనా కల్లోలం కొనసాగుతూ ఉంది… మరోవైపు కరోనా పరిణామాల నుంచి జనజీవనం బయటపడుతూ ఉంది… మనుషుల కదలిక పెరిగింది. లాక్ డౌన్ ఆంక్షలు దాదాపుగా తొలగిపోవడంతో ప్రజలు స్వేచ్ఛగా కదులుతున్నారు. మళ్లీ పనులు, వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయాయి.. ఇంకెన్నాళ్లు ఇలా అనే భావన ప్రజలను బాగా ప్రభావితం చేస్తున్నట్టుగా ఉంది. ఒకవైపు కరోనా కేసుల నంబర్లు పెరుగుతున్నా, వాటిని ఖాతరు చేసే పరిస్థితి దాదాపు కనిపించకపోవడం గమనార్హం.
కొత్త కేసులు తగ్గడం లేదు.. ఇది మాత్రం స్పష్టం అవుతూ ఉంది. ఎప్పటికప్పుడు కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. తీవ్ర స్థాయిలో కాకపోయినా.. రోజువారీగా అన్ని ప్రాంతాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇలా కరోనా వ్యాప్తి కొనసాగుతూ ఉంది.
డిశ్చార్జిలు కూడా అంతే స్థాయిలో.. వారం రోజుల కిందట ఏ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయో.. వారం తర్వాత అదే స్థాయిలో డిశ్చార్జిల నంబర్ కనిపిస్తూ ఉంది. కోలుకున్న వారు డిశ్చార్జ్ అవుతూ.. కొత్త కేసుల నంబర్ ను రీచ్ అవుతున్నారు. కొత్తగా నమోదవుతున్న కేసులకు ధీటుగా డిశ్చార్జిలు కూడా నమోదు అవుతుండటంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగా పెరగడం లేదు.
ఒక్క శాతం లోపు మరణాలు.. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణ మరనాలు ఒక్కశాతం లోపు ఉన్నాయి. మొత్తం కేసులతో పోలిస్తే మరణాల సంఖ్య ఒక్క శాతానికన్నా తక్కువగా ఉంది. జాతీయ స్థాయి సగటుతో పోల్చినా కరోనా కారణ మరణాల రేటులో ఏపీలో మెరుగైన పరిస్థితుల్లో ఉంది.
స్వేచ్ఛగా విహరించేస్తున్న ప్రజలు.. పండగల సంతల్లో ప్రజలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. మాస్కులు అయితే వేసుకుంటున్నారు కానీ, భౌతిక దూరం మాత్రం ఉండటం లేదు. బంధువుల ఊర్లకు తిరిగే వాళ్లూ కొంత మేర తగ్గినా.. తిరగాలనుకున్న వారికి మాత్రం అడ్డు లేదు. అలాగే పెళ్లిళ్ల విషయంలో కూడా జనాల తీరు మారిపోయింది. శ్రావణమాసంలో ఆఖరి ముహూర్తాలకు జరిగిన పెళ్లిళ్లలో జనాల సంఖ్య బాగా కనిపించిందని తెలుస్తోంది.
వందల మంది హాజరీతో కూడా కొన్ని పెళ్లిళ్లు జరిగినట్టుగా తెలుస్తోంది. తక్కువ మందితో పెళ్లిళ్లు చేసుకోవాలని చెబుతున్నా, జనాలు మాత్రం అప్పుడే తీరు మార్చుకున్నారు. పిలిచే వాళ్లూ అలాగే ధైర్యంగా పిలిచారు, ఆ పెళ్లిళ్లకు హాజరయ్యే వాళ్లనూ కరోనా భయాలు ఆపలేకపోయాయి. దీంతో వందల సంఖ్యల్లో అతిథులతో పెళ్లిళ్లూ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది.
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ కొనసాగింపు.. కాస్త క్లిస్టమైన ఆరోగ్య పరిస్థితుల్లో ఎవరైనా చేరితే వారిని ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీ చేస్తున్న వైనం మాత్రం కొనసాగుతోందని సమాచారం. 60 యేళ్లు దాటిన వారు.. 70, 80 లలో ఉన్న వారికి కరోనా సోకి ఆసుపత్రులను ఆశ్రయించినప్పుడు.. ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్లు భారీగా ఫీజులు వసూలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. రోజుకు 40 వేల రూపాయల స్థాయిలో ఫీజు ఉంటుందని, ఇష్టమైతే చేరవచ్చు లేకపోతే లేదని ఆసుపత్రులు ముందే తేల్చి చెబుతున్నాయట. ఇలా కరోనా విపత్తును ప్రైవేట్ ఆసుపత్రులు ఆదాయ మార్గంగా మార్చుకున్నాయి.
ఇదీ క్షేత్ర స్థాయి పరిస్థితి. కరోనా విజృంభణ కొనసాగుతోంది, జనాలు తిరుగుతున్నారు, ఆసుపత్రులు దోచుకుంటున్నాయి. నూటికి 99 శాతం మంది సురక్షితంగా కరోనా నుంచి బయటపడుతున్నారు. వీరిలో చాలా శాతం మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారే.