బీజేపీ ఏపీ ఇన్‌చార్జ్ సునీల్ దియోధర్ శనివారం చేసిన ట్వీట్ ఆయన్ని నవ్వుల పాలు చేసింది. తెలుగే రాని ఆయన…తెలుగు భాషోద్యమకారుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి నాడు సునీల్ ఆంధ్రుల మాతృభాషలో ట్వీట్ చేయడం మొట్ట మొదట అభినందించాల్సిందే.
వైసీపీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ సునీల్ దియోధర్ ట్వీట్ చేశారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలకు ఎవరూ అతీతులు కాదు. అందుకు కరుణాకర్‌రెడ్డైనా, చంద్రబాబునాయుడైనా, సోము వీర్రాజైనా అతీతులు కాదు. అయితే ఆ విమర్శలు సమయంతో పాటు సందర్భోచితంగా ఉంటే…విమర్శలకు గురైన వారు కూడా ఆనందిస్తారు, ఆహ్వానిస్తారు.
అలా కాకుండా వర్షాకాలంలో కొనాల్సిన గొడుగును వేసవిలో కొంటే ఎంత అతిశయోక్తిగా ఉంటుందో….వెంటనే రియాక్ట్ కావాల్సిన దానిపై ఆరు నెలలకు స్పందిస్తే అలా ఉంటుంది. కరుణాకర్‌రెడ్డిపై సునీల్ ట్వీట్ విపరీత పోకడలకు నిదర్శనం. ఎందుకంటే గత నెల (జూలై) 18న తన ఉద్యమ సహచరుడు, మిత్రుడైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరుణాకర్‌రెడ్డి ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏంటో ఒకసారి చూద్దాం.
“నలభై ఆరు సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ బాధితులుగా మీరు(ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు), నేను ఇరవై ఒక్క నెలలు ముషీరాబాద్ జైల్లో ఉన్నప్పుడు ఆయన మన సహచరుడు. సాహచర్యం భావజాలంలో కాదు గానీ, కటకటాల వెనుక కలిసి ఉన్నాము, అందుకు. రాజకీయ సిద్ధాంతంలోనూ, జనక్షేమంకై నడిచే మార్గంలోనూ ఎవరి భావాలు వారివే. కానీ మనం మనుషులం.
శరీరం మంచానికి కట్టుబడే 81 సంవత్సరాల వయసులో, అందులోనూ అనారోగ్యంతో ఉన్న ఆయన పైన ప్రభుత్వం దయ చూపాల్సిన అవసరం ఎంతో ఉంది. రాజకీయాలతో సంబంధం సంబంధం లేకుండా మానవాళి మంచికి ఎన్నో కార్యక్రమాలు చేసిన మీరు దయతో ఆలోచించండి. అహింసయే పరమ ధర్మం, శత్రువులు సైతం క్షమించాలి, వేదాంత వారసత్వ భారతదేశపు ఉప రాష్ట్రపతి అయిన మీరు… వరవరరావు విడుదల విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని సజల నయనాలతో విన్నవించుకుం టున్నాను ” అని వెంకయ్యనాయుడికి రాసిన లేఖలో కరుణాకర్‌రెడ్డి విన్నవించుకున్నారు.
ఈ లేఖ అర్థం కావాలంటే మొదట మనిషై ఉండాలి. ఆ మనిషికి స్పందించే హృదయం ఉండాలి. “సాహచర్యం భావజాలంలో కాదు గానీ, కటకటాల వెనుక కలిసి ఉన్నాము, అందుకు. రాజకీయ సిద్ధాంతంలోనూ, జనక్షేమంకై నడిచే మార్గంలోనూ ఎవరి భావాలు వారివే. కానీ మనం మనుషులం”- ఈ వాక్యాలు చాలవా అర్థం చేసుకునేందుకు.
ఈ సందర్భంగా సునీల్ దియోధర్ ట్వీట్‌ను పరిశీలిద్దాం.
‘జగన్ రెడ్డి గారూ దేశ ప్రధానమంత్రిని హతమార్చాలనే కుట్ర పన్ని అరెస్ట్ అయిన విరసం నేత వరవరరావును విడుదల చెయ్యాలని కోరిన భూమన కరుణాకరరెడ్డిని ఇంకా సస్పెండ్ చేయలేదంటే ఈ లేఖ మీ అనుమతితోనే వెళ్ళిందనుకోవాలా? తక్షణమే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి’
సునీల్ దియోధర్‌కు ఏపీ బీజేపీలో అనుకూల శత్రువులు ఉన్నట్టున్నారు. తెలుగు రాని ఆ వ్యక్తి పేరుతో అన్యాయమైన ట్వీట్ చేయించారు. ఒక మనిషిని కాపాడండి అని కోరడం కూడా తప్పు అయితే…కరుణాకర్‌రెడ్డి తప్పు చేసినట్టే. అలాంటి తప్పులు ఎన్ని చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉంటారు.
అహింసయే పరమ ధర్మం, శత్రువులు సైతం క్షమించాలి, వేదాంత వారసత్వ భారతదేశపు ఉప రాష్ట్రపతి అయిన మీరు…అని కరుణాకర్‌రెడ్డి వేడుకోలుకు ముఖ్యమంత్రి జగన్ అనుమతి కావాలా సునీత్ దియోధరా…మీ అజ్ఞానం ఎంత అపారమైందో ఈ ట్వీటే నిదర్శనం. అందులోనూ గత నెలలో కరుణాకర్‌రెడ్డి బహిరంగ లేఖ రాస్తే…దాన్ని కౌంటర్ చేస్తూ ఇప్పుడు ట్వీట్ చేయడం ఏంటి స్వామి? అంతా లోకేశ్ టైప్ వాళ్లు మీ పేరుతో ట్వీట్ చేస్తున్నట్టున్నారు, కాస్తా జాగ్రత్త. మీరు మామూలు నేత కాదు. ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ .
కనీసం మీ హోదాకైనా గౌరవం తెచ్చేలా ట్వీట్లు చేయడం అలవాటు చేసుకుంటే మంచిది. అలా కాదంటే , మీకంటే మీ పార్టీకే ఎక్కువ నష్టమని మీ తరపున ట్వీట్లు చేసే వాళ్లు గ్రహిస్తే మంచిది.