2008 డిసెంబర్ 24న నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజోలి వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2.95 టీఎంసీల నీటి పరిమాణంతో కుందూనది నుంచి వచ్చే నీటి ఆధారంగా ఈ ప్రాజెక్టును నిర్మించాలని తలపెట్టారు. అంతకు దశాబ్దాల నుంచి కర్నూలు జిల్లా నీటి ఉద్యమ కారులు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ ప్రాజెక్టు వల్ల అటు కర్నూలు జిల్లాకు, మరోవైపు కడప జిల్లాకూ ఎంతో లబ్ధి కలుగుతుంది.
కర్నూలు జిల్లాలోని 60 వేల ఎకరాలు, కడప జిల్లాలోని 90 వేల ఎకరాల భూమికి నీటి వనరు స్థిరీకరణ జరుగుతుంది. భారీ వర్షాలు వచ్చినప్పుడు కుందూనది గట్టిగా పారుతుందని, ఆ నీటిని వినియోగించుకునే అవకాశం లేకుండాపోతోందని, అంతిమంగా అవి సముద్రాన్ని చేరుతున్నాయని అక్కడి వారు రిజర్వాయర్ నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే దశాబ్దాల పాటు ప్రభుత్వాలు పట్టించుకోలేదు! రాయలసీమ ప్రాంత కరువు నివారణకు రాయలసీమ వద్దే పరిష్కారం ఉన్నా నేతలు పట్టించుకోలేదు. మొసలి కన్నీరు కార్చే వారే తప్ప పరిష్కారాలు చూపిన వారు లేరు.
అలాంటి సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2008లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ సంకల్పించగా.. ఆ తర్వాత వెంటనే ఎన్నికలు వచ్చాయి, ఆయన మళ్లీ సీఎం అయ్యారు. ఆ తర్వాత నాలుగు నెలలకే ఆయన మరణించారు. అంతే.. ఈ ప్రాజెక్టు అటక ఎక్కింది.
వైఎస్ తర్వాత రోశయ్య సీఎం అయ్యారు, దిగిపోయారు. ఇక రాయలసీమ ప్రాంతానికే చెందిన కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మూడేళ్ల పాటు కొనసాగారు. ఆ తర్వాత కూడా తనను తాను రాయలసీమ బిడ్డగా ప్రత్యేకంగా చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాటు రాజ్యమేలారు! అరచేతిలో అద్భుతాలు చూపించారు. అయితే వైఎస్ హయాం నాటి ఈ పథకానికి మాత్రం మోక్షం లభించలేదు!
రాయలసీమ కరువును పారద్రోలినట్టుగా చంద్రబాబు నాయుడు అనేక సార్లు చెప్పుకున్నారు. అయితే ఈ చిన్న రిజర్వాయర్ నిర్మాణం ద్వారా రెండు జిల్లాల్లోని దాదాపు లక్షన్నర ఎకరాలకు నీళ్లు అందే అవకాశం ఉంది, వందల గ్రామాల రూపురేఖలు మారిపోతాయి. దీనికయ్యే ఖర్చు కూడా పెద్దదేమీ కాదు. లక్షల కోట్ల బడ్జెట్ లు ప్రవేశ పెట్టే రాష్ట్రంలో రమారమీ వెయ్యి కోట్ల వ్యయం! అయితే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కానీ, చంద్రబాబు హయాంలో కానీ ఇలాంటి ప్రాజెక్టును చేపట్టలేదు.
దీనికేమీ అంతరాష్ట్ర వివాదాలు లేవు. భారీ ఎత్తున భూ సేకరణలు అవసరం లేదు. ఉన్న నీటిని వాడుకోవడానికి చిన్న సదుపాయం ఏర్పాటు చేయడం అంతే. 2008 లో వైఎస్ దీనికి శంకుస్థాపన చేస్తే.. పన్నెండేళ్ల తర్వాత ఆయన తనయుడు ఇప్పుడు ఈ పథకానికి మోక్షం కలిగిస్తూ ఉన్నాడు. కిరణ్, చంద్రబాబుల హయాంలో ఈ పథకాన్ని పూర్తి చేసి ఉంటే.. వారికి కీర్తి మిగిలేది కాదా?
పాలకులకు మనసుండాలి. కిరణ్ కు గొప్ప నాయకుడు అయిపోవాలనే ఆశయాలు లేవు. జాక్ పాట్ పదవిలో ఆయనకు సర్దుకోవడానికే సమయం చాల్లేదు. చంద్రబాబు ఆలోచనలు ఎంతసేపూ రియలెస్టేట్ ప్రాజెక్టు అమరావతి, గ్రాఫిక్స్, డిజైన్స్ మీదే సాగాయి. చిన్న చిన్న పనులే పెద్ద కీర్తిని తెచ్చిపెడతాయి. చంద్రబాబు హయాంలో చిటికెల పందిళ్లు వేయడం మీద తప్ప.. పనులు చేయడం మీద ఆసక్తి కనిపించలేదు.
చివరకు ఎట్టకేలకూ ఇప్పుడు జగన్ హయాంలో ఆ పథకానికి టెండర్ల పిలుపు వరకూ వచ్చింది వ్యవహారం. ఎన్నికల హామీలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రకటించారు జగన్. కేబినెట్ లో అందుకు సంబంధించి నిర్ణయం జరిగింది. జ్యూడీషియల్ ప్రివ్యూను కూడా పూర్తి చేశారు. మొత్తం 1,375 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు కోసం పోరాడిన వారు ఇప్పుడు ఆనందపడుతున్నారు. జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పాదయాత్ర సమయంలో కర్నూలు జిల్లాకు చెందిన కొందరు ఉద్యమకారులు జగన్ ను కలిసి.. ఈ ప్రాజెక్టు ఆవశ్యకత గురించి వివరించి, వైఎస్ హయాంలో దానికి శంకుస్థాపన కూడా జరిగిందని గుర్తుచేసి.. హామీ పొందారు. 36 నెలల వ్యవధిలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి జగన్ ప్రభుత్వం టెండర్లకు సిద్ధం అయ్యింది.
రాయలసీమ పాలిట వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు గొప్ప వారయ్యారు? రైతుల పాలిట ఆయన ఎందుకు భగీరథుడు అయ్యాడు? అనే విషయాలకు సమాధానాల కోసం ఇలాంటి ఉదంతాలను పరిశీలించాలి. ఈ పథకాలను పూర్తి చేస్తే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా నిస్సందేహంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి సమానమైన కీర్తిని సంపాదించుకుంటారు! పచ్చ పందులు మరెంత బురద జల్లినా వైఎస్ ఎలా శిఖర స్థాయిలో నిలిచారో, జగన్ ఇమేజ్ కూడా అంతే స్థాయికి చేరుతుంది.