ఎప్పటికైనా డైరక్టర్ అవుతానంటోంది హీరోయిన్ నివేత థామస్. నటించడానికి స్కోప్ ఉండే పాత్రలు చేస్తూ, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్.. ఒక్కో అడుగు వేస్తూ దర్శకురాలిగా మారుతానంటోంది.
“ప్రస్తుతానికి నేను నటిని మాత్రమే. నన్నెవరూ పిలిచి డైరక్షన్ ఛాన్స్ ఇవ్వరు. డైరక్షన్ ఛాన్స్ కోసం నేనే వెళ్లాల్సి ఉంటుంది. అయితే వెంటనే మూవీ డైరక్షన్ చేయను. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తాను. అలా మెల్లగా దర్శకురాలిగా మారుతాను.”
ఇలా డైరక్టర్ అవ్వాలనే తన ఆలోచనల్ని బయటపెట్టింది నివేత థామస్. తను, నాని కలిస్తే ఎక్కువగా పాత్రలు, స్క్రిప్టుల గురించి మాట్లాడుకుంటామని.. నానితో మాట్లాడుతుంటే చాలా విషయాలు తెలుస్తాయని అంటోంది.
“సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ నాని నాకు మంచి ఫ్రెండ్. నాకు ఏదైనా కథ నచ్చితే వెంటనే తనతో డిస్కస్ చేస్తుంటాను. అలాగే తన సినిమాల్లోని పాత్రలు గురించి నాతో డిస్కస్ చేస్తుంటాడు. చాలా విషయాల్లో నాని నాకు స్ఫూర్తి.”
ఈ లాక్ డౌన్ టైమ్ లో 3 సినిమా ఆఫర్లు వచ్చాయంటోంది నివేత. ప్రస్తుతం ఆ కథలన్నీ డెవలప్ మెంట్ స్టేజ్ లో ఉన్నాయని, త్వరలోనే వెల్లడిస్తానని తెలిపింది. మరోవైపు ఓటీటీలో నటించాలని తనకు ఉన్నప్పటికీ ఎవ్వరూ తనను అడగలేదని చెబుతోంది నివేత థామస్.