న్యాయం అందరికీ న్యాయమే. అమరావతి రాజధాని రైతులు తమకు అన్యాయం జరిగిందని కోర్టు మెట్లు ఎక్కారు. మరి విశాఖవాసులు కూడా ఇదేరకమైన ఆలోచన చేస్తున్నారుట. తమకు కూడా కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నారుట.
ఇంతకీ విషయం ఏంటంటే ఏనాడూ అభివ్రుద్ధికి నోచుకోని ఉత్తరాంధ్రా జిల్లాలకు పరిపాలన రాజధానిని జగన్ సర్కార్ ప్రకటించింది. తద్వారా తమకు ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని, వలసల జిల్లాలకు మోక్షం కలుగుతుందని భావిస్తున్నారు. అయితే రాజధానిని అడ్డుకునేలా కొన్ని రాజకీయ పార్టీలు వ్యవహరించడం, విశాఖ రాజధానిగా ఎందుకు పనికిరాదు అని కించపరచే విమర్శలు చేయడాన్ని స్థానికులైన వారు తట్టుకోలేకపోతున్నారుట.
అదే విధంగా విశాఖలో ప్రభుత్వం స్టేట్ గెస్ట్ హౌస్ కడతామని ప్రకటిస్తే దాన్ని కూడా అడ్డుకుంటూ అడుగడుగునా విశాఖ ప్రగతికి అవరోధాలు స్రుష్టిస్తున్న వారి మీద విశాఖ సగటు పౌరులు గుర్రు మీద ఉన్నారు. తాము కూడా విశాఖ అభివ్రుద్ధి కోసం అడుగుతామని, న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతామని అంటున్నారు.
ఇందులో లాజిక్ ఉందన్నది నిజం. మూడు ప్రాంతాలు అభివ్రుద్ధి చేస్తామని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఒకేచోట కుప్పపోసిన అభివ్రుద్ధిని, హైదరాబాద్ మోడల్ ని కొందరు కోరుకుంటున్నారు. అదే జరిగితే అత్యంత వెనకబడిన ఉత్తరాంధ్రా జిల్లాలు ఎప్పటికీ ముందుకు సాగలేవు. అందువల్ల న్యాయం చేయమని కోరే హక్కు ఈ ప్రాంతీయులకు ఉంది. ఆ దిశగా కోర్టుకు వెళ్తామంటున్న నాయకులు, ప్రజా సంఘాలకు ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిందే.